ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో మరొక అడ్వాన్స్డ్ ప్లేయర్ వచ్చేసింది. అదే అమేజ్‌ఫిట్ బీఐపి 6. అమోలెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 140కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, Zepp Flow AI వంటి హై ఎండ్ ఫీచర్లతో ఇది ముస్తాబయింది. వాచ్ టచ్ స్క్రీన్ సైజు 1.97 అంగుళాలు. డిస్ప్లే గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్‌తో వాచ్ బాడీని డిజైన్ చేశారు. హెల్త్ ట్రాకింగ్ విషయానికి వస్తే… ఇది బయోట్రాకర్ 6.0 పీపీజీ సెన్సర్‌తో వస్తుంది. హార్ట్‌రేట్, SpO2, స్ట్రెస్, హెచ్ఆర్వీ.. లాంటి లైవ్ హెల్త్ మెట్రిక్స్‌ను నిరంతరం ట్రాక్ చేస్తుంది. దీని స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌తో నిద్రను కూడా ట్రాక్ చేయొచ్చు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ చేస్తుంది. వచ్చిన నోటిఫికేషన్లకు వాచ్ నుంచే రిప్లయి ఇవ్వొచ్చు. 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఉండటంతో తరచూ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
ధర: రూ.7,999
దొరుకు చోటు : అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
ఫోన్లలో ఏఐని పూర్తిస్థాయిలో వాడేస్తున్నాం. మరి, ల్యాపీల మాటేంటి? ల్యాప్‌టాప్‌లలో పలు అవసరాలకు ఏఐని వాడలేమా? నిరభ్యంతరంగా వాడొచ్చు. అందుకు అనువైనవే.. హెచ్‌పీ కంపెనీ విడుదల చేసిన ఓమ్ని బుక్ 5 సిరీస్ ల్యాపీలు. రెండు మోడల్స్‌లో వచ్చిన ఈ ల్యాపీలు.. 14, 16 అంగుళాల 2కె ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తున్నాయి. TUV+Eyesafe సర్టిఫికేషన్ ఉండటం వల్ల కళ్లకు ఇబ్బంది లేకుండా పని చేసుకోవచ్చు. ఈ హెచ్‌పీ ఓమ్ని బుక్ 5 మోడల్స్‌లో.. స్నాప్‌డ్రాగన్ ఎక్స్, స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ప్లస్ ప్రాసెసర్లను వాడారు. వీటిలో ఉన్న క్వాల్కామ్ హెగ్జాగాన్ ఎన్పీయూ ఏకంగా 45 TOPS (టెరా ఆపరేషన్స్ పర్ సెకండ్) ప్రాసెసింగ్ పవర్ అందిస్తుంది. 32 జీబీ ర్యామ్, 1టీబీ వరకూ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం క్వాల్కామ్ అడ్రినో జీపీయూ ప్రాసెసర్‌ని వాడారు. హెచ్‌పీ ల్యాపీల్లో కోపైలట్ + ఫీచర్లు ముందుగానే ఇంటిగ్రేట్ చేశారు. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 సపోర్ట్‌తో పాటు.. రెండు యూఎస్బీ – సి, ఒక యూఎస్బీ – ఎ, ఒక 3.5 ఎంఎం ఆడియో జాక్ పోర్ట్స్ ఉన్నాయి.
ధర : రూ.68,000 (ప్రారంభం)
దొరుకు చోటు : అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
టెక్ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరుస్తూ హువావే ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ మార్కెట్లో అడుగుపెట్టింది. మేట్‌బుక్ ఫోల్డ్ అల్టిమేట్ పేరుతో సరికొత్త ల్యాపీని పరిచయం చేసింది. అయితే ఇది మామూలు ఫోల్డబుల్ కాదండోయ్.. ఇందులో విండోస్ ఓఎస్ లేదు! దీనికి బదులుగా హువావే సొంతంగా అభివృద్ధి చేసిన హార్మనీ ఓఎస్-5ను వాడుతున్నారు. 18 అంగుళాల భారీ ఓఎల్ఈడీ డిస్ప్లేతో దీన్ని తయారుచేశారు. ల్యాప్‌టాప్‌లా ఫోల్డ్ చేసినప్పుడు ఇది 13 అంగుళాల సైజ్‌లో ముడుచుకుంటుంది. అప్పుడు దీని మందం కేవలం 14.9 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఒకే స్క్రీన్‌లా పూర్తిగా ఓపెన్ చేస్తే.. 7.3 మిల్లీమీటర్లు ఉంటుంది. బరువు 1.16 కిలోలు మాత్రమే. డిస్ప్లే రిజల్యూషన్ 3296×2472 పిక్సల్స్. ల్యాప్‌టాప్ మోడ్‌లో వర్చువల్ కీబోర్డుపై హ్యాపీగా పని చేసుకోవచ్చు. లేదంటే.. హువావే ఇచ్చిన 5 మిల్లీమీటర్ల అల్యూమినియం వైర్లెస్ కీబోర్డ్ కూడా ప్రయత్నించొచ్చు. 32 జీబీ ర్యామ్, 1టీబీ లేదా 2టీబీ ఎస్ఎస్డీ వేరియంట్లు ఉన్నాయి.
ధర : రూ. 2,85,000 (అంచనా)
దొరుకు చోటు : అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
వన్‌ప్లస్.. ఇప్పుడు మరో టాప్‌లెవల్ ఫోన్‌తో వస్తున్నది. అదే.. వన్‌ప్లస్ 13ఎస్. ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఈ ఫోన్ ట్రెండ్ అవుతున్నది. ప్రధానంగా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రావడం.. కొత్తగా ‘ప్లస్ కీ’ అనే ఫీచర్‌ను తీసుకురావడం ఈ ఫోన్ ప్రత్యేకత. గతంలో వన్‌ప్లస్ ఫోన్లకే ప్రత్యేకమైన అలర్ట్ ైస్లెడర్ను తొలగించి.. ఇప్పుడు ‘ప్లస్ కీ’ అనే కొత్త బటన్ని తీసుకొచ్చారు. ఇది ఐఫోన్లో ఉండే యాక్షన్ బటన్ తరహాలో ఉంటుంది. రింగ్ మోడ్ మార్చడం, ఫొటోలు తీయడం, రికార్డింగ్ స్టార్ట్ చేయడం వంటి అనేక ఫంక్షన్లకు ఇది ఉపయోగపడుతుంది. డిస్ప్లే విషయానికి వస్తే.. 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED ప్యానెల్‌తో, 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 50 మెగా పిక్సెల్ IMX906 ప్రైమరీ సెన్సర్‌తోపాటు 50ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 6,260 ఎంఏహెచ్ సామర్థ్యంతోపాటు 80వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర: రూ.45,000
దొరుకు చోటు : అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.