Women obese | ప్రస్తుతం కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గాలి, నీరు.. ఇలా అన్నీ కాలుష్యంతో నిండిపోయి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏది తినాలన్నా భయం వెంటాడుతున్నది. మరీ ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత వేధింపులకు గురిచేస్తున్నదని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. మహిళల్లో ఊబకాయానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని పరిశోధకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నుంచి ఎలా రక్షించుకోవాలో.. ఊబకాయం రాకుండా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురితమైన ఇటీవలి అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలం పాటు వాయు కాలుష్యానికి గురయ్యే మధ్య వయస్సు మహిళల్లో అధిక కొవ్వు శాతం, తక్కువ లీన్ మాస్‌తో సంబంధం కలిగి ఉంటుందని యూఎస్‌లోని మిచిగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. వాయు కాలుష్యం కారణంగా శరీరంలో కొవ్వు 4.5 శాతం లేదా 2.6 పౌండ్ల వరకు పెరుగుతుంది. మధ్య వయస్కులైన మహిళల బరువు వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), నడుము పరిమాణం, శరీర కొవ్వుల మధ్య సంబంధం ఉంటుందని మరో కారణాన్ని కూడా వీరి అధ్యయనంలో బహిర్గతమైంది.
ఎక్కువగా 40-50 ఏండ్ల మధ్య వయసులోని మహిళలు వాయు కాలుష్యానికి దీర్ఘకాలం పాటు బహిర్గతమవుతుంటారని యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ జిన్ వాంగ్ పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా అధిక స్థాయి సూక్ష్మ కణాలు, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ ఎ పెరుగుదల ఉంటుందని ఆయన చెప్తున్నారు. వీటి కారణంగా ఆ వయసు మహిళల శరీరం బరువు పెరగడం గుర్తించవచ్చుననంటున్నారు. ఈ అధ్యయనం నిర్వహణ నిమిత్తం మొత్తం 1,654 మంది తెలుపు, నలుపు రంగుల్లోని చైనీస్, జపనీస్ మహిళల నుంచి ‘స్టడీ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ అక్రాస్ ది నేషన్’ డాటా సేకరించారు. 50 ఏండ్ల వయసున్నవారిని 2000 సంవత్సరం నుంచి 2008 వరకు పర్యవేక్షించారు. వీరి శరీరంపై వాయు కాలుష్యం, శారీరక శ్రమ మధ్య సంబంధాన్ని విశ్లేషించారు.
నివారణామార్గాలు
మహిళల్లో ఊబకాయాన్ని నివారించేందుకు కొన్ని మార్గాలున్నాయి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. సమతుల ఆహారాన్ని తీసుకుంటూ.. వేపుళ్లు, తీపి పదార్థాలను దూరం పెట్టాలి. ఐస్‌క్రీమ్, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ తినడం మానేయాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూడాలి. వాయు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కును మాస్క్‌తో కప్పిపెట్టాలి. యూవీ రేస్‌ను నివారించేందుకు గాగుల్స్ ధరించాలి. లేదంటే గొడుగు పట్టుకెళ్లాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలి.