కొందరికి ఇల్లు అంటే స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. రిచ్‌గా కనిపించాలని అనుకుంటారు. నటి అదితి రావ్ హైదరీ మాత్రం ఇల్లంటే నాలుగు గోడల నిర్మాణం కాదనీ, ఓ ఎమోషన్ అని చెబుతున్నది. అభిరుచికి తగ్గట్టు, చిన్ననాటి జ్ఞాపకాలతో తన నివాసాన్ని ఓ అందమైన గూడుగా మార్చుకుందామె! ‘నేను పనిచేసేది పొగడ్తల ప్రపంచంలో.. కానీ, నాకు నిజమైన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? ఎవరైనా నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు చాలా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. వాళ్ల ఇల్లే అన్నట్టుగా భావించాలి! అదే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది’ అని చెప్పుకొచ్చింది అదితి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇంటి గురించి చెబుతూ.. ‘మీరు నమ్మరు!! చిన్నప్పుడు నాన్న నాకు ఒక అద్భుతమైన బొమ్మల ఇల్లు తయారు చేసిచ్చారు.
అందులోనే బెడ్రూమ్లు, మంచాలు, చిన్న చిన్న మనుషుల బొమ్మలు, ఇంటి చుట్టూ లైట్లు, మెలికలు తిరిగిన మెట్లు ఇలా భలేగా ఉండేది. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు.. నా బొమ్మల ఇల్లే అనిపించింది’ అని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ‘నాకు వెంటిలేషన్ అంటే చాలా ఇష్టం. హాల్లో కిటికీ పక్కన కూర్చుని, అలా ఎక్కడికో చూస్తూ ఆలోచనల్లో ఉండిపోతాను.
మా ఇల్లు కాస్త చిన్నదే! కానీ, చాలా సౌకర్యంగా ఉంటుంది. ముంబయి లాంటి నగరంలో చిన్న ఓపెన్ స్పేస్ ఉండటం ప్రత్యేకమే! మనం కోరుకున్న ఇంట్లో ఉన్నప్పుడు.. అనుకున్న డెస్టినీకి చేరుకున్న ఫీలింగ్ కలుగుతుంది. మనల్ని మనమే కొత్తగా కనుక్కున్నట్టు అనిపిస్తుంది. నావరకైతే ఇల్లంటే ఓ నిర్మాణం కాదు.. భావోద్వేగం’ అని ఇంటితో ఉన్న బంధాన్ని పంచుకుంది అదితి.