పిల్లలకు స్కూల్ అకాడమిక్స్ చాలా ముఖ్యమే. కానీ వాటితో పాటు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉండటం అవసరం అంటున్నారు జోహో మల్టీనేషనల్ టెక్ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు. మ్యూజిక్, పొయెట్రీ, మార్షల్ ఆర్ట్స్ లాంటి యాక్టివిటీలు పిల్లల జీవితంలో భాగం చేయాలని చెబుతున్నారు. తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇందులో మార్కులు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సలహా ఇచ్చారు.
‘ఫైన్ ఆర్ట్స్, కల్చర్, కుకింగ్ వంటి వాటిలో బేసిక్ ఫౌండేషన్ ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది. అయితే పిల్లలు వీటిలో ఎక్స్పర్ట్ కావడం, మెడల్స్ సాధించడం కొలమానం కాదు. ఆయా రంగాల్లో వారికి ప్రవేశం ఉంటే చాలు.
ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల్లో క్రమశిక్షణ పెంచుతాయి. చెస్, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, శిల్పకళ లాంటివి నేర్పించడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఆ దిశగా బిడ్డలను తల్లిదండ్రులు ప్రోత్సహించాల’ని శ్రీధర్ వెంబు పోస్టు చేశారు. ఆయన పోస్టుకు నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు తమ కోరికలు, లక్ష్యాలను పిల్లలపై రుద్దకూడదనీ, పిల్లల ఆకాంక్షలకు, అభిరుచులకు విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు.