విదేశాల్లో ఉంటున్నా.. పుట్టిన నేపథ్యం అతణ్ని రైతన్న కోసం పాటుపడేలా చేసింది. అన్నదాతల బలవన్మరణాలు ఆయన్ను కదిలించాయి. అందరిలా అయ్యోపాపం అంటూ జాలి చూపించడం వరకే పరిమితం కాలేదు. వీధిన పడిన రైతు కుటుంబానికి భరోసా కల్పించడానికి ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు విర్గనేని రాంబాబు. తన స్నేహితులు మురళి, నరేందర్‌తో కలిసి రాంబాబు ఏర్పాటు చేసిన సుభిక్షా అగ్రి ఫౌండేషన్ (సాఫ్) భర్తను కోల్పోయి భారంగా బతుకీడుస్తున్న మహిళలకు భరోసానిస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 250 కుటుంబాలు సాధికారత సాధించేలా తోడ్పాటు అందించింది.
మాదిఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్న ప్రాంతం వరంగల్. జిల్లాలోని జనగామ నియోజకవర్గం పరిధిలో రైతుల వరుస ఆత్మహత్యలపై ప్రచురితమైన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచాయి. ఈ వార్తలకు చలించిన విర్గనేని రాంబాబు ఆ రైతు కుటుంబాలకు తనవంతు సాయం అందించాలని భావించారు. అనంతపురం జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన విదేశాల్లో స్థిరపడ్డారు. తన మిత్రుడు మురళితో కలిసి రైతన్న ఆత్మహత్యల గురించి చర్చించారు. ఇంటి పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఒక దారి చూపాలని నిశ్చయించుకున్నారు. అప్పటికే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్న గరిడి నరేందర్‌ను సంప్రదించారు. వారి ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. నరేందర్ కొంతమందితో కలిసి జనగామ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు సేకరించారు. వారి కుటుంబాలను పరామర్శించి.. వారి పరిస్థితుల గురించి వాకబు చేశారు. దయనీయమైన వారి స్థితి గురించి సేకరించిన వివరాలను రాంబాబు, మురళితో పంచుకున్నారు నరేందర్. వారి జీవితాలు మార్చాలనే సంకల్పంతో 2016లో ఈ ముగ్గురూ కలిసి సుభిక్షా ఆగ్రి ఫౌండేషన్ (సాఫ్)ను స్థాపించారు.
బతుకు దెరువు చూపి..
ఫౌండేషన్ ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రారంభించారు. అయితే, డబ్బులు ఇచ్చినంత మాత్రాన వారి కష్టం కడతేరద ని భావించారు. వారికి స్థిరంగా ఆదాయం వచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయిన మహిళలకు బతుకుదెరువు చూపించే ప్రణాళిక సిద్ధం చేశారు. పశుపోషణ, టైలరింగ్, కిరాణ దుకాణం పెట్టుకునేందుకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. ఎవరికి ఏది ఆసక్తి ఉంటే ఆ రంగంలో స్థిరపడే ఏర్పాటు చేశారు. దారి చూపించి ఊరుకోలేదు. మూడేండ్లపాటు వారి సాధకబాధకాలు పర్యవేక్షించారు. అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తూ సాధికారత సాధించే దిశగా ప్రోత్సహించారు. వారి పిల్లల చదువు కోసం ఇతర దాతల నుంచి విరాళాలు సేకరించి సాయం అందించారు. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
250 కుటుంబాలకు భరోసా..
2023 వరకు జనగామ, సిద్దిపేట ప్రాంతాలకే పరిమితమైన సాఫ్ తర్వాత నారాయణపేట జిల్లాలో సైతం తన సేవలు ప్రారంభించింది. మరో బాధ్యతను సైతం భుజాన వేసుకుంది. కేవలం రైతన్నలే కాకుండా అకస్మాత్తుగా ఇంటి దిక్కును కోల్పోయిన కుటుంబాలకూ అండగా నిలుస్తున్నది. జనగామ, సిద్దిపేట, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటి వరకు 250 మంది ఒంటరి మహిళలకు చేయూతనిచ్చారు వీళ్లు. వారి బతుకులు మార్చారు. తమ సేవలు ఇతర జిల్లాలకు కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు రాంబాబు అండ్ కో. ఈ మహిళలకు ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడానికి వీ హబ్‌తో కలిసి శిక్షణ ఇప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాధితులకు తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత పరిష్కారం చూపుతున్న సుభిక్షా అగ్రి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం!
పిండి గిర్ని ఇప్పించారు…
సొంత పొలం లేకపోవడంతో మా ఆయన భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటోడు. కాలం కాకపోవడంతో పెట్టుబడి పైసలు కూడా రాలేదు. దీంతో అప్పులు పెరిగినయ్. అవి తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నడు. మా బతుకులు ఎట్లా అనుకున్నం. అప్పుడు సాఫ్ సంస్థ దారి చూపెట్టింది. మా ఇంటికొచ్చి మరీ మా పరిస్థతిని తెలుసుకొని పిండి గిర్ని పెట్టించిన్రు. అప్పటికే ఉన్న కిరాణ దుకాణం బాగు చేయించి అందులో సామాను ఇప్పించిన్రు. వారి ప్రోత్సాహంతో నా పిల్లలను మంచిగ చదివించిన. పిండిగిర్ని, కిరాణ దుకాణం, చికెన్ దుకాణాలు నడుపుతున్న.
-బానోత్ మంగమ్మ, అంకుషాపూర్, జనగాం జిల్లా
…? రాజు పిల్లనగోయిన