నది జీవితం వంటిది అన్నాం. నది బిందువుగా మొదలవుతుంది. జీవితం బిందువుగా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండ కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది.
ఇంద్రధనుస్సును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవిత నాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం! దెబ్బలు తింటేనే మనిషి రాటు తేలుతాడు. నదిలో మరొక నది కలిసిన సోయగం వర్ణనలకు అందదు. హిమాలయంలో అలకనంద – మందాకినితో కలుస్తుంది.
ఆ దృశ్యం అపూర్వం. జీవితమూ అంతే. జీవితంలోనికి ఒక భాగస్వామిని వస్తుంది. రావడమే కొన్ని సుడిగుండాలు ఏర్పడతాయి. ఒకరికి ఒకరు అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది. అర్థం చేసుకుంటే అంతే! నదీ సంగమం. ఇద్దరు ఉండరు. మనసు ఒకటి – ప్రాణం ఒకటిగా మసలుకుంటారు! ‘వాగర్థావివ సంపృక్తౌ’ అంటాడు కాళిదాసు. మాట – అర్థం వలె ముడిపడతారు! విడదీయరాదు. ‘భాస్కరేం ప్రభాయథా’ అంటాడు వాల్మీకి. సూర్యుడి వెలుగు వలె విడదీయడం అసంభవం.
గంగా యమునలు – మందాకినీ అలకనందలు – ప్రాణహిత గోదావరులు – తుంగా కృష్ణలు, ఒకటేమిటి, నదులన్నీ మరొక నదిని కలుపుకొని సాగుతాయి. జీవితమూ అంతే! కామక్రోధాదులు సాధారణంగా మనిషి అదుపులో ఉంటాయి. అయితే జీవితం సహితం ప్రకృతియే! దానికీ ఆటుపోట్లుంటాయి.
అయితే తప్పును తెలుసుకోవడం – సరిదిద్దడం విజ్ఞుల లక్షణం. నది సాగుతుంది. కాలువలు అవుతుంది. పొలాలకు నీరిస్తుంది. నేలను సస్యశ్యామలం చేస్తుంది. జీవితమూ అంతే. తన పని నెరవేర్చుకుంటుంది. సంతానం ఏర్పరుస్తుంది. వారి ద్వారా సమాజాన్ని సారవంతం చేస్తుంది. తనువు చాలిస్తుంది. అనంత విశ్వంలో లీనమవుతుంది. ఆకాశం నుండి పడిన నీరు సాగరం వైపు సాగుతుంది. పరిణామం జీవితం.
– దాశరథి రంగాచార్య ‘జీవనయానం’ నుంచి