బస్‌స్టాప్‌లో ఓ చిరునవ్వు.. ప్రేమ మొగ్గ తొడుగుతుంది. కాలేజీ కెఫేలో మరో నవ్వు.. లవ్వు రివ్వుమంటుంది. అలా చిగురించిన కాదల్.. స్వచ్ఛమైనది అయితే, కాలపరీక్షను తట్టుకొని నిలబడేది. విఫలమైతే.. ఆ ప్రేమ చిత్తు కాగితాలపై కవితలై గాలికి కొట్టుకుపోయేది. ఇదంతా నిన్నటి తరం ముచ్చట. ఇప్పుడు.. వాట్సాప్ నంబర్ ఉంటే చాలు!
పొద్దున జస్ట్ ‘హాయ్’తో మొదలయ్యే ముచ్చట్లు.. సాయంత్రానికి ‘ఓకే బేబీ’ వరకు వెళ్లిపోతున్నాయి. మర్నాటికి ‘లవ్యూ’ దాటేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చిగురిస్తున్న ప్రేమలు.. ఫలవంతమైతే మంచిదే! విఫలమైతేనే.. డిజిటల్ దునియాలో వెంటాడే జ్ఞాపకాలు జీవితాంతం వేధిస్తాయి! ‘ఫాలో.. ఫాలో.. యూ’ అంటూ ‘ఎక్స్’ని పదేపదే ‘ఎక్స్’ వేదికగానో.. ఇన్‌స్టా రీల్స్తోనో.. యాక్సెస్ చేస్తూ నాన్సెన్స్ క్రియేట్ చేసుకుంటారు. బ్రేకప్ తర్వాత మీ అడుగులు, ఆలోచనలు అటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని బౌండరీలు గీసుకుని మాజీల యాక్సెస్‌ని బ్లాక్ చేయాల్సిందే!!
రేష్మి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్. సెల్ఫీ పోస్టు చేసిన అరగంటకే మరో సెల్ఫీ ఎఫ్బీ వాల్లో వాలిపోవాల్సిందే! అలా ఓ సెల్ఫీకి వచ్చిన కామెంట్‌తోనే దగ్గరయ్యాడు వరుణ్. అది మొదలు వాట్సాప్ తోడుగా.. ఎఫ్బీ సాక్షిగా.. ఇన్‌స్టాలో టన్నుల కొద్దీ ప్రేమ ఊసులు పంచుకున్నారు. వాస్తవ ప్రపంచంలో కన్నా.. సోషల్ దునియాలోనే ఎక్కువ కాలం గడిపారు. అయితే, వారి ప్రేమలోకి బగ్స్ ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కారణాలు ఏవైనా ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. ‘నీ దారి నీది.. నా దారి నాద’ంటూ లవ్ ఎకౌంట్ నుంచి సైన్ అవుట్ అయ్యారు. సామాజిక మాధ్యమం వేదికగా ఒక్కటైన ఈ జంట బ్రేకప్ తర్వాత కూడా అదే సోషల్ మీడియా వలలో గతించిన జ్ఞాపకాలను పదే పదే పోగేసుకోవడం మొదలుపెట్టారు.
నిద్ర లేవగానే వరుణ్ ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు. రేష్మి ఎవరికి గుడ్‌మార్నింగ్ పెట్టిందో, ఏ పోస్టు చేసిందో చెక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. రేష్మి పరిస్థితి కూడా దాదాపు అంతే. గతంలో ట్విట్టర్లో చెప్పుకొన్న చిట్టిపొట్టి సంగతులను స్క్రోల్ చేస్తూ చూసుకుంటున్నారు. ఇద్దరూ ఇక కలవడం అసాధ్యం అని తెలుసు. అయినా ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. వీళ్లిద్దరే కాదు.. ఈ తరంలో చాలామంది పరిస్థితీ ఇలాగే ఉంది. అప్పటివరకూ ఫోన్, ల్యాపీ, ట్యాబ్‌లో పంచుకున్న ఎమోజీలన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కానీ, మీ ప్రయాణం ముందుకు సాగాలంటే.. జ్ఞాపకాల రీల్స్‌ను దాటుకొని రియల్ లైఫ్‌లోకి రావాల్సిందే! అందుకోసం గతించిన సోషల్‌లైఫ్ గదుల తలుపులు మూయాల్సిందే. అందుకు ఈ నియమాల్ని అనుసరించండి.
దూరం శాశ్వతం అని ఫిక్స్ అయితే ఆలస్యం చేయొద్దు. వెంటనే మీ సోషల్ మీడియా నెట్వర్క్ నుంచి వారిని తొలగించండి. ప్రొఫైల్‌ని బ్లాక్ చేయడమే అందుకు మార్గం. అంతేకాదు.. మీ అత్యంత సన్నిహితులైన మిత్రులకు విషయం చెప్పి వారి నెట్వర్క్ నుంచి కూడా మాజీలను బ్లాక్ చేయమనాలి. దీంతో వారి అప్డేట్స్ మీ వరకు రాకుండా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లో మీరు పంచుకున్న జ్ఞాపకాలను విధిగా తుడిచేయాలి. వీలైతే పాత అకౌంట్‌ను డిలీట్ చేసి.. కొత్తది క్రియేట్ చేసుకోవడం ఉత్తమం. ఊహించని ట్విస్ట్‌లతో విధి ఎప్పుడైనా మళ్లీ ఇద్దరినీ కలిపితే ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. అప్పటివరకు ‘మీకు మీరే.. మాకు మేమే’ మంత్రం పఠించాల్సిందే!!
ఫోన్ చేతిలోకి తీసుకోగానే మునివేళ్లు సోషల్ మీడియా ఐకాన్లపైకి పోకుండా చూసుకోవడం కష్టమే. అయినా, కొత్త ఐకాన్లపై దృష్టిమళ్లేలా చేసుకోవాలి. మ్యూజిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని ఇష్టమైన సంగీతాన్ని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన వెబ్సిరీస్ని పనిగట్టుకొని చూడండి. మీ నైపుణ్యాలను సానబెట్టుకునేందుకు తగిన వెబ్ సర్వీసులు, ఈ-పుస్తకాల్ని చదవండి. మిమ్మల్ని మీరే ప్రేరేపించుకునేలా ఫోన్లో వాల్ పేపర్లను సెట్ చేయండి. దీంతో మీరు ఫోన్ అన్‌లాక్ చేసిన ప్రతిసారి చక్కటి సందేశం వాల్‌పేపర్ మీద కదలాడి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
అన్నీ మూటకట్టేసి మాజీల జోలికి వెళ్లకూడదు అనుకోవడం.. ఆత్రుత చంపుకోలేక ఏదో ఒక బలహీన క్షణంలో వారి అకౌంట్స్ చెక్ చేయడం చేస్తుంటారు చాలామంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. వారి అకౌంట్ చెక్ చేయాలని భావించినప్పుడు, చెక్ చేసినప్పుడు మీకు మీరే ఫైన్ వేసుకోండి. మీ మనసు లయ తప్పిన ప్రతిసారీ ఫైన్ బాక్స్‌లో నిర్దేశించుకున్న మొత్తం వేయండి. దాంట్లో డిపాజిట్ అవుతున్న మొత్తాన్ని చూసినప్పుడు మీ బలహీనత తెలిసొస్తుంది. దాన్ని అధిగమించాలనే ఆలోచనలూ కలుగుతాయి. అందుకు ప్రయత్నాలూ మొదలుపెడతారు.
మొదల్లో రోజుకి ఓ పదిసార్లు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన మీరే ఏదో ఒకరోజు ఐదుసార్లే ఫాలో అవుతారు. మీకే షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ రోజు మీకు మీరే ‘ట్రీట్’ ఇచ్చుకోండి. నచ్చిన సినిమా చూడొచ్చు. లేదంటే.. ఫేవరేట్ రెస్టారెంట్‌కి వెళ్లి ఇష్టమైనవి తిని సెలెబ్రేట్ చేసుకోండి.
ఏదైనా విషయాన్ని మనతో మనమే బిగ్గరగా మాట్లాడుతూ చెప్పుకొంటే ఎక్కువ క్లారిటీ వస్తుందంటారు. మదిలోకి మాజీల ధ్యాస వచ్చిన వెంటనే ‘ప్రొఫైల్ క్లిక్ చేయడం.. ఫొటోలు చూడటం.. అప్డేట్స్ తెలుసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? గతాన్ని తవ్వుకుంటూ.. చేదు జ్ఞాపకాల్ని మోసుకుంటూ.. వాస్తవ ప్రపంచానికి దూరంగా ఎందుకు ఉండాలి? నువ్వు అలా ఉండొద్దు. థింక్ ప్రాక్టికల్లీ. డూ యువర్ బెస్ట్’ అని మీకు మీరే ధైర్యం నూరిపోసుకోండి.
అప్రయత్నంగానే మాజీల గురించి క్రేజీగా ఆలోచిస్తున్నట్టయితే మీ దగ్గరి స్నేహితుల సాయం కోరండి. మీరున్న స్థితిని వారితో పంచుకోండి. వారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయండి. పదేపదే కంట్రోల్ తప్పుతున్నారన్న భావన కలిగితే.. స్నేహితులతో కలిసి సరదాగా విహారానికి వెళ్లండి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి. మిత్ర బృందంతో కలిసి ఏదైనా గొప్ప పనికి శ్రీకారం చుట్టండి. తద్వారా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది.
నెట్టిల్లు పరిచయం కాకముందు కూడా ఈ ప్రేమలు.. బ్రేకప్‌లు ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. అయితే, అప్పటికీ ఇప్పటికీ మాధ్యమాలు మారాయి. అప్పట్లో విడిపోయిన జంట మళ్లీ ఎదురుపడటానికే దశాబ్దాల సమయం పట్టేది. కానీ, ఇప్పుడు బ్రేకప్ చెప్పిన మరుక్షణంలో ఇన్‌స్టాలో ఇద్దరి అప్డేట్స్ మిలాఖత్ చేసుకుంటున్నాయి. బ్రేకప్ తర్వాత మాజీలు చేసే పోస్టులు చూసి చాలామంది అతిగా ఊహించేసుకుంటారు. వాళ్లు విరహ సందేశాన్ని పోస్టు చేస్తే… వీళ్లు తెగ బాధపడిపోతారు. క్యాజువల్ పోస్టు పెడితే.. ‘విడిపోయామన్న బాధే లేదు’ అనుకుంటూనే తెగ ఆవేదన చెందుతుంటారు.
సదరు వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ ఫాలో అవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ‘అలా ఫాలో అవుతూ ఉంటే.. ఎప్పటికైనా మళ్లీ కలవకపోతామా?’ అన్న భావనలో ఉంటారు మరికొందరు. కలవాలనే ఉంటే.. నేరుగా కలుసుకోవచ్చుగా! మధ్యలో ఈ ఇన్స్టంట్ వారధి ఎందుకు? దీనివల్ల బ్రేకప్ బాధ తగ్గదు సరికదా.. కొత్త సమస్యలు పుట్టుకురావొచ్చు. ఒకసారి బ్రేకప్ తర్వాత ఇద్దరి మానసిక స్థితి కూడా గందరగోళంగానే ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. అంతగా ఆ వ్యక్తిని కోరుకుంటే నేరుగా కలిసి మాట్లాడుకోవాలి. అంతేకానీ, బీటలువారిన బంధాన్ని సోషల్ మీడియాలో
సరి చేసుకుంటానంటే కుదరదు.