Refrigerator | ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే చాలు… మిగిలిపోయిన ప్రతీ ఆహార పదార్థాన్నీ అందులో యుగాంతం వరకూ ఉంచేయవచ్చనే అపోహ కొందరిది. నిజానికి ఎంతలా గడ్డ కట్టించే ఫ్రీజర్‌లో ఉంచినా.. ప్రతి పదార్థానికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది! ఇవిగో ఉదాహరణలు…
చేపలు: పెద్దగా కొవ్వు లేని చేపలు రెండునెలల వరకు నిలవ ఉంచొచ్చు. సాల్మన్, సారడైన్ లాంటి ఫ్యాట్ ఉండే చేపలను నెలకు మించి నిల్వ ఉంచకూడదు.
మాంసం: రెడ్ మీట్‌ను ఫ్రీజర్‌లో రెండు నెలలకు మించి ఉంచితే పాడైపోతుంది. ఇక పౌల్ట్రీ మాంసం మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.
వండిన ఆహారం: మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రీజర్‌లో ఉంచితే… కొన్ని వారాల పాటు నిల్వ ఉంటాయి. కానీ తినే ముందు వాటిని వేడి చేయకూడదన్నది నిపుణుల మాట.
ఐస్‌క్రీం: మూత తెరిచిన తర్వాత రెండు నెలలలోపు ఫ్రీజర్ నుంచి ఐస్క్రీంను ఖాళీ చేయాల్సిందే!
ఇవి కాకుండా పిజ్జా, బ్రెడ్, చీజ్… ఇవన్నీ కూడా కొన్ని వారాలకు మించి ఫ్రీజర్‌లో ఉంచకూడదు.