Valentine’s Day | లాంగ్ డ్రైవ్.. యువతకు ఫేవరెట్ చిల్అవుట్. వాలెంటైన్స్ డే… జంటలకు అంతకు మించిన ప్రేమ యాత్రా ఉండదు. ఇక ఈ రెంటినీ జోడిస్తే నేటి తరం గ్రాండ్ సెలెబ్రేషన్. కారులో షికారు వెళ్లడమే కాదు, ఆ కారులోనే ప్రేమికుల దినోత్సవాన్నీ జరుపుకొంటున్నది కుర్రకారు. దానికి తగ్గట్టు, కొన్ని సంస్థలు డెకొరేషన్ సెట్లను అమ్ముతున్నాయి. ‘ఆ బాధంతా మీకెందుకు? మేమే అలంకరణ చేసి పెడతాం’ అంటున్నారు పార్టీ ప్లానర్లు. ‘వాలెంటైన్స్‌డే కార్బూట్ డెకొరేషన్’ ముచ్చటేంటో చూద్దామా!
పండగంటే నాలుగు రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. కానీ వాలెంటైన్స్ డే అంటే మాత్రం నెల రోజుల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఆ నాటికి చెలి చేతికి అందించాలనుకున్న ఆ కానుకేదో ఆన్లైన్లో వెతకడం ప్రారంభిస్తాడు అతను. తనకు నచ్చిందీ అతను మెచ్చేదీ తన చేతితోనే చేసి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇష్టంగా కష్టపడుతుందామె. ఆ రోజేదో తమకు మాత్రమే ప్రత్యేకం అన్నంత సంబురం. ఇక, ప్రేమకు చిహ్నంగా భావించే ఆ రోజున ఇద్దరూ కలిసి ఆనందంగా సెలెబ్రేట్ చేసుకోవడానికి వినూత్నమైన ప్రణాళికలు రచించుకుంటారు. తాము నిత్యం షికారుకెళ్లే కారునే తమ ఆనందానికి వేదిక చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఈ వాలెంటైన్స్ డేకి కార్బూట్ డెకొరేషన్ పిచ్చపిచ్చగా ట్రెండింగ్ అవుతున్నది.
కార్ వెనక డిక్కీని అందంగా ముస్తాబు చేయడమే కార్ బూట్ డెకొరేషన్. ఇండ్లకు దూరంగా పచ్చటి చెట్లూపొలాల మధ్య రోడ్డు మీద ఇలా పుట్టిన రోజులు చేసుకోవడం ఈ మధ్య ట్రెండ్ అవుతున్నది. అదే రీతిలో ప్రేమ సంబురాన్ని ప్రతిబింబించేలా అందమైన అలంకరణలు వస్తున్నాయిప్పుడు. అమెజాన్‌లాంటి వెబ్సైట్లలో కిట్ల రూపంలో వీటిని అమ్ముతున్నారు. ఫొటోలు వేలాడదీసేందుకు క్లిప్పుల వరుస, లైట్లు, హృదయాకార బెలూన్లు, నక్షత్రాల తోరణాలు, ఐలవ్యూ అక్షరాల వరుసలు… ఇలా మనం ఎంచుకున్న డెకొరేషన్ను బట్టి రకరకాల వస్తువులు ఇందులో వస్తున్నాయి. వాటిని తెప్పించుకుని మనమే ముస్తాబు చేసుకోవచ్చు. మెట్రో సిటీల్లో పనిచేసే కొన్ని సంస్థలు కూడా ఈ ముస్తాబు చేసి ఇస్తున్నాయి. ‘నన్ను పెండ్లాడతావా ప్లీజ్’ అంటూ ప్రేయసికి మనసులో మాట చెప్పేందుకూ, ఈ సందర్భాన్నే ఎంచుకుంటున్న కుర్రకారుకు ఇంతకు మించి మంచి అవకాశం ఇంకేం ఉంటుంది. అందుకే ఈ వాలెంటైన్స్‌డేకి కారుదే జోరు అంటున్నారు!