భారతీయ బాలికల్లో నెలసరి కాలం.. ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలతోనే గడుస్తున్నది. దాదాపు 88 శాతం టీనేజీ అమ్మాయిలకు రుతుస్రావం గురించి సరైన అవగాహన లేదని ఇటీవలి ఓ సర్వేలో తేలింది. ఫలితంగా వేల సంఖ్యలో ఆడపిల్లలు.. నెలలో వారంపాటు చదువుకు దూరంకావాల్సి వస్తున్నది. ఇది వారి పురోగతికి అడ్డంకిగా మారుతూ.. భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నది. వారి కలలను దూరం చేస్తున్నది.
చైల్డ్ రైట్స్ అండ్ యూ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 80 కోట్ల మంది బాలికలు, మహిళలు ‘రుతుస్రావం’ పొందుతున్నారు. వీరిలో 50కోట్ల మందికి.. నెలసరిపై సరైన అవగాహన ఉండటంలేదు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించే సౌకర్యాలు కూడా లేవు. చాలామందికి ‘రుతుస్రావం’ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు. భారత్ విషయానికి వస్తే.. దాదాపు 23 శాతం మంది బాలికలు.. నెలసరి సమయంలో పాఠశాలలకు గైర్హాజరు అవుతున్నారట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది.
ఈ క్రమంలో కౌమారదశలో ఉన్న బాలికల్లో రుతుస్రావం గురించిన విద్యను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిశుభ్రతను ఎలా పాటించాలి అనే విషయాల గురించి అవగాహన కల్పించాలి. నెలసరి అనేది తమ శరీరానికి అవమానకరమైనది కాదనే విషయం ప్రతి బాలికా తెలుసుకోవాలి. పునరుత్పత్తిలో కీలకంగా ఉంటూ.. తమకు గర్వాన్ని తీసుకొస్తుందనే సంగతిని గుర్తెరగాలి. అప్పుడే.. బాలికలకు సాధికారత, సమానత్వంతోపాటు గౌరవం కూడా దక్కుతుంది. నెలసరి గురించిన సరైన అవగాహన ఉన్నప్పుడే.. పీరియడ్స్ టైమ్‌లోనూ ప్రతి ఆడపిల్లా భయపడకుండా పాఠశాలకు వెళ్తుంది.
బాలికల్లో రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం.. వారిని ప్రతికూల వాతావరణంలోకి తోసేస్తుంది. నెలసరి ఆరోగ్య అక్షరాస్యత.. వారికి ప్రాథమిక సమాచారం కన్నా ఎక్కువ. చాలామందికి ఒకరకమైన విముక్తి మార్గం కూడా! ఇది ఆడపిల్లల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. రుతుక్రమ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ద్వారా బాలికలు తమ ఆరోగ్యంపట్ల మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. తమ రుతుచక్రాలను సమర్థంగా నిర్వహించడాన్ని అర్థం చేసుకుంటారు. అదే సమయంలో ఏదైనా వైద్య సహాయం అవసరమయ్యే లక్షణాలను గుర్తించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ‘నెలసరి’ అవమానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వారుకూడా భాగస్వాములు అవుతారు. చివరిగా.. ‘నెలసరి’పై అవగాహన అంటే.. కేవలం సానిటరీ ఉత్పత్తులను అందించడమే కాదు. అమ్మాయిల ఆత్మగౌరవాన్ని కాపాడటం. వారిలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించడం. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి.. ఒక తరాన్ని ప్రేరేపించడం.