కోటపల్లి, మే 31 : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జీ వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీలో జూనియర్లు, సీనియర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల కమిటీని శుక్రవారం సాయంత్రం ప్రకటించగా ఇందులో జూనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేశారని పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. సంవత్సరాలుగా పార్టీలో కష్టపడి పని చేస్తుంటే తమను కాదని, ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మంత్రి వివేక్ ఓటమి కోసం బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు పదవులు ఇవ్వడం ఏమిటని కోటపల్లి మండల గ్రూప్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కోటపల్లి మండల గ్రూప్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ జెండాలు మోసి, కష్టపడి ఎమ్మెల్యేలను గెలిపించుకొని అధికారంలోకి తీసుకువస్తే వలస నాయకులకు పెద్దపీట వేయడం ఏమిటని ప్రశ్నించారు.
కోటపల్లి మండలం వాట్సాప్ గ్రూప్‌లో ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోటపల్లి మండలంలో ‘ఒక్క ఎస్సీ మీకు దొరకలేదా…? అసలు కమిటీ వేసిన దరిద్రుడు ఎవరూ.. ?ఎవరిని అడిగి కమిటీని వేశారు? ఇయ్యాల కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నాయకులు మీకు కనబడలేదా ?’ అని ఘాటుగా ప్రశ్నించారు. డీసీసీ కమిటీలో కూడా ఇలానే అన్యాయం చేశారని, తాజాగా మండల కమిటీలో కూడా ఇలానే చేశారని, బీఆర్ఎస్లో పనిచేసినవారికి కాంగ్రెస్ మండల కమిటీలో చోటు కల్పించారని, డీసీసీ ప్రెసిడెంట్‌తోనే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మరో సీనియర్ నేత స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మండల కమిటీలో ఉన్నవారు పార్టీకి ఎంతమంది పని చేశారో చెప్పాలని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా డీసీసీ ప్రెసిడెంట్ పైనే విమర్శలు చేశాడు. తమకు పార్టీకి జరిగిన అన్యాయాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూప్‌లలో తమ ఆవేదను తెలిపి కఠిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని చర్చించుకున్నారు. సీనియర్లను పక్కన పెట్టి అటు డీసీసీలోను, ఇటు మండల కమిటీలలో తమకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీ సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని, ఇలా అయితే కష్టమని ఆ నాయకులు పేర్కొంటున్నారు. మండల కమిటీలో ప్రస్తుతం ఉన్న నాయకులకు పార్టీలో సభ్యత్వం ఉందా.? ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది..? మండల కమిటీ నియామకం ఎవరి ఆమోదంతో జరిగిందో చెప్పాలని కోటపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రికి తలనొప్పిగా మారిన మండల కమిటీ
కోటపల్లి మండల కాంగ్రెస్ కమిటీ రా్రష్ట్ర మం త్రి వివేక్ కు తలనొప్పిగా మారిందనే చెప్పవ చ్చు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగాల్సింది పోయి ఎదురుగాలులు వీస్తుండడంతో ఏం చే యాలో పాలు పోని పరిస్థితి ఉన్నది. కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించకపోవడం, అన్ని గ్రామాలకు పదవులు కేటాయించకపోవడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు.