హైదరాబాద్, మే 31 (నమస్తేతెలంగాణ)/ మేడ్చల్, : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసిన ఒక్క మేలైనా చెప్పగలవా?’ అంటూ వెలిసిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ‘రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు’ అని విమర్శించారు.
అలాగే బీజేపీ ఈటలకు చేసిన మేలును తెలుపుతూ ‘ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.. మోదీగారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్‌తో గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ‘బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు..? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్‌కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? అని నిలదీశారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం ఈటల సంబంధీకులు ఆ ఫ్లెక్సీని తొలగించారు.
ఈటల రాజేందర్‌పై వెలిసిన ఫ్లెక్సీల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పందించారు. పార్టీ అంటే గిట్టనివారే కుట్రలు చేశారని ఆరోపించారు. ఇందులో పార్టీ నాయకుల ప్రమేయమేమీ లేదని చెప్పుకొచ్చారు. ఫ్లెక్సీల వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశామని చెప్పారు. ఎంపీ అర్వింద్ స్పందిస్తూ ఈటలపై ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. సంజయ్, తన మధ్య ఈటల విభేదాలు సృష్టిస్తున్నారనడంలో వాస్తవంలేదని కొట్టిపారేశారు.