పెరుగుతున్న నేరాలకు తగ్గట్టుగా మగువల రక్షణ కోసం రకరకాల యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ 24×7 యాప్ ఆ కోవకే చెందుతుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ యాప్ మహిళలను బాడీగార్డ్‌లా 24 గంటలూ పర్యవేక్షిస్తుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరం. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించడానికి ఐదు కాంటాక్ట్ నెంబర్లు ఎంపిక చేసుకోవాలి. అనుమానాస్పద సమయాల్లో ఈ యాప్‌లో ఉండే పానిక్ బటన్ నొక్కితే చాలు.. ఎంపిక చేసిన ఐదు నెంబర్లకూ అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు పోలీసులకు కనెక్ట్ అవుతుంది.
అంబులెన్స్ సేవలకు కూడా సమాచారం అందుతుంది. జీపీఎస్ అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా లొకేషన్ కూడా షేర్ అవుతుంది. అత్యవసర సందర్భాల్లో ఆడియో, వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసి పంపడంతోపాటు వాయిస్ మెసేజ్ కూడా పంపే వీలుంటుంది. స్మార్ట్ 24×7 తోడుంటే రాత్రి సమయాల్లో పనిచేసే మహిళలు, ఒంటరి ప్రయాణికులు కంగారుపడాల్సిన అవసరం రాదు.