‘యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి.. ప్రస్తుతం ఏ కొలువుకైనా పోటీ ఉన్నది.. నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉత్తమ ఉద్యోగులుగా గుర్తింపు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని ఎస్బీఐటీలో ఆదివారం పోలీస్‌శాఖ నిర్వహించిన మెగా జాబ్‌మేళాను కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌శాఖ నిరుద్యోగుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
మామిళ్లగూడెం, మే 21 : యువత చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నిరుద్యోగ యువత కోసం జిల్లా పోలీస్‌శాఖ అధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అజయ్ మాట్లాడుతూ పోలీస్‌శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని వివిధ రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ జాబ్‌మేళాలో 150 కంపెనీల్లో 8200 మందికి ఉద్యోగాలు లభించాయని, వీటి కోసం 15వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యను పూర్తి చేసిన ప్రతి ఒకరూ ప్రభుత్వ ఉద్యోగం పొందడం సాధ్యం కాదని, అలాంటి వారు జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తున్నందున పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగంలో బెంగుళూరును మించి తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, తద్వారా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు సాధ్యమవుతున్నదని తెలిపారు. ఇప్పుడు ఐటీ రంగంలో ఖమ్మం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నదన్నారు. విదేశాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలైన ప్రవాస భారతీయులతో మంత్రి కేటీఆర్ ఖమ్మం ఐటీ హబ్ గూర్చి ప్రస్తావించడం మనకు గర్వకారణమన్నారు. ఒకప్పుడు 53వేల కోట్ల ఐటీ రంగం ఎగుమతులు ఉండగా నేడు 1.87 కోట్ల ఎగుమతులకు చేరుకున్నామని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, రాబోయేతరాలకు ఇలాంటి అనేక జాబ్‌మేళాలు అం దించాలని యువతను కోరారు. ఒకప్పుడు తిండిగింజల కోసం పక రాష్ట్రాల మీద ఆధారపడిన సందర్భాలు ఉన్నాయని, కానీ నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మనమే దేశానికి తిండిగింజలు ఎగుమతి చేసి రైస్బౌల్ఆఫ్ తెలంగాణ స్థాయికి ఎదిగామని తెలిపారు. జాబ్‌మేళా నిర్వహణ కోసం కష్టపడిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిని మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా పలు కంపెనీల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. ఆయా కంపెనీలు ఆదివారం 5025 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేయగా.. మరో 3వేల మందికి రెండురోజుల్లో నియామక పత్రాలు అందజేయనున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. జాబ్‌మేళా భద్రతకు 200మంది పోలీస్ సిబ్బంది పనిచేశారు. యువతకు మంచినీరు, మజ్జిగ, షామియానాలు, అంబులెన్స్, అత్యవసర కోసం మెడికల్ బృందాలను ఏర్పాటు చేశారు. చంటిపిల్లల తల్లులు, గర్భిణులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ ఐపీఎస్ అవినాష్, వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్లు, హెచ్ఆర్ మేనేజర్ పాల్గొన్నారు.
Khammam3
జాబ్‌మేళాకు విశేష స్పందన
– ఇద్దరు బధిరులకు ఉద్యోగాలు
జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. యువత పెద్దఎత్తున తరలివచ్చారు. పోలీస్ అధికారుల ప్రచారంతో జిల్లావ్యాప్తంగా 14వేల మందికి పైగా యువత పేర్లు నమోదు చేసుకోగా జాబ్‌మేళాకు మాత్రం 16వేల మంది హాజరయ్యారు. ప్రతి ప్రక్రియను పోలీస్ అధికారులు దగ్గరుండి సూచనలు చేస్తూ యువకులను ముందుకు నడిపించారు. సత్యసాయి ట్రస్ట్, వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించారు. అమెజాన్‌లో వేర్‌హౌజ్ విభాగంలో ఉద్యోగం సాధించిన ఎల్లావులా ప్రణయ్, ఖమ్మం ఐటీ హబ్‌లో సోవారి కంపెనీలో ఉద్యోగం సాధించిన జి.విహారి, నెల్లూరి కావ్య, యూత్ ఎండ్ జాబ్స్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఐ సంస్థలో ఉద్యోగం పొందిన ఇద్దరు బధిరులు కకర్లమూడి నితిన్, కకర్లమూడి మితిన్కు మంత్రి పువ్వాడ నియామక పత్రాలను అందించారు.
కార్పొరేట్ ఉద్యోగాలు సాధించాం..
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాబ్‌మేళాలో ఎలైట్ క్యాడ్ ఇంజినీర్స్ సంస్థలో ఉద్యోగాలు సాధిం చాం. ఏడాదికి 1.80 లక్షల ప్యాకేజీతో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ లెటర్ అందించారు. చాలా ఆనందంగా ఉంది. జాబ్‌మేళా వల్ల మాకు ఉద్యోగ, ఉపాధి లభించింది.
– బి.సైదిరెడ్డి, ఎస్.లింగాప్రసాద్
ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది
జాబ్‌మేళాలో చాలా అవకాశాలు వచ్చాయి. రెండు కంపెనీల్లో ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రతి ఏటా 1.80 లక్షలతో ప్రిమియర్ హెల్త్‌కేర్, బీజెడ్ సంస్థలకు ఎంపికయ్యాను. ఖమ్మం యువతకు పోలీసు వారు ఉద్యోగమేళా నిర్వహించడం అభినందనీయం.
– షేక్ సమరుక్సానా