రఘునాథపాలెం, డిసెంబర్ 26: ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వస్తే అసభ్యకరంగా బూతులు తిడతారా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? అంటూ రఘునాథపాలెం ఎస్సీ కాలనీకి చెందిన యువకులు ఇల్లెందు ప్రధాన రహదారిపై శుక్రవారం ఆందోళనకు దిగారు. రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట 100 మందికిపైగా యువకులు, వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీస్ జులుం నశించాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రఘునాథపాలెం సీఐ ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇల్లెందు రోడ్డులో సుమారు అర్ధగంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అయితే గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని కానిస్టేబుల్ బూతులు తిట్టినట్లు యువకులు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన 11మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రఘునాథపాలెంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో సుమారు 30మందికి పైగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు.