ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 22: ‘నవ్వించేవాడు యోగి.. నవ్వే వాడు భోగి.. నవ్వలేని వాడు రోగి’ అన్నట్లు ప్రపంచ నవ్వుల దినోత్సవం వచ్చే నెల 7న ఖమ్మంలో పెద్ద ఎత్తున నవ్వుల హంగామా వచ్చేస్తోంది. మొగిలి ఎంటర్టైన్మెంట్లు, కమెడియన్ మొగిలి గుణకర్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7న నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సాయంత్ర 6 గంటల నుంచి ‘వంద నవ్వుల విందు’ నాన్‌స్టాప్ కామెడీ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం కళాక్షేత్రంలో ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నాగబత్తిని రవి ఈ హాస్యోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. యాంకర్, హాస్య నటుడిగా, కళాకారుడిగా రాణిస్తున్న మొగిలి గుణకర్ ఈ విందును ఏర్పాటు చేయడం హాస్య ప్రియులకు కనువిందేనన్నారు.
సందర్భోచిత నవ్వులు ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్నిస్తాయని, ఈ నవ్వుల విందును ప్రతి ఒక్కరూ పసందు చేయాలని కోరారు. నిర్వాహకుడు మొగిలి గుణకర్ మాట్లాడుతూ.. ఈ పరుగుల సమాజంలో నవ్వు ఓ మంచి ఔషధంలాగా పని చేసి నూతన ఉత్సాహానిస్తుందన్నారు. ప్రముఖ చానల్స్ ఫేమ్ కళాకారులు డేవిడ్‌రాజు, కుమారి, ఈశ్వర్ – రమేశ్‌లతో కామెడీ స్కిట్స్, మొగిలి గుణకర్, సుధీర్, బాబా షరీఫ్‌లతో స్టాండప్ కామెడీ, మిమిక్రీ కళాకారులు కిశోర్ నల్లగట్ల, వరుణ్‌ల మిమిక్రీ, ఫైర్ రవి జగ్లింగ్ షో, జూనియర్ బాలయ్య, రామచరణ్‌ల హంగామాలతోపాటు అనేక హాస్య సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కళాకారులు కావేరి రామారావు, నాగసాయి, గరిక సంపత్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘నెల నెలా వెన్నెల’ నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్రావు, ఏఎస్ కుమార్ కళాకారులు ఎం.ప్రసాద్, రమేశ్, నరసింహారావు, నాగసాయి తదితరులు పాల్గొన్నారు.