దమ్మపేట రూరల్, మే 9: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం లేకుండానే రూ.వందల కోట్ల పనులు జరుగుతున్నాయి. కేవలం ఔట్‌సోర్సింగ్‌లో నియమించిన సివిల్ ఇంజినీర్ల పర్యవేక్షణతోనే పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నాణ్యతను తనిఖీ చేయడానికి ‘నాణ్యత నియంత్రణ, నిఘా విభాగం’ లేకుండానే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ పనుల పర్యవేక్షణకు గిరిజన సంక్షేమశాఖ నుంచి డిప్యూటీ ఈఈని డిప్యూటేషన్‌పై నియమించి పనులను పూర్తి చేశారు.. కానీ, సిద్దిపేట జిల్లా నెర్మెట్టలో నిర్మించిన ఫ్యాక్టరీ, ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మాత్రం ఔట్సోర్సింగ్ సివిల్ ఇంజినీర్లే పర్యవేక్షిస్తున్నారు.
పనుల నాణ్యతపై ప్రభుత్వేతర సంస్థ జారీ చేసే ధ్రువీకరణతోనే బిల్లుల చెల్లింపులు జరుగుతుండడం గమనార్హం.కల్లూరుగూడెంలో వందల కోట్లతో పనులు జరిగే ఫ్యాక్టరీ ప్రాంగణాల్లో ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకుండానే పనులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఇసుక నాణ్యత పరీక్షకు, కంకర పరిమాణం, నాణ్యత పరీక్షకు అవసరమైన జల్లెడలు నిర్మాణ ప్రాంగణాల్లో లేకపోవడం గమనిస్తే ఆయిల్‌ఫెడ్ యాజమాన్య నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. కాంక్రీట్ బలం పరీక్షకు క్యూబ్ టెస్టింగ్ మిషన్ వంటి పరికరాలు సైట్లో కానరావు. దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో ఇటీవల ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు.
సివిల్ పనులను మెజర్మెంట్ బుక్(ఎంబీ) ఔట్ సోర్సింగ్ ఇంజినీర్ రికార్డు చేసిన తరువాత వీటిని చెక్ మెజర్ చేసేది ఆయిల్‌ఫెడ్‌లో విధులు నిర్వహిస్తున్న మెకానికల్ ఇంజినీర్లే కావడం గమనార్హం. సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఉన్న శాఖల్లో పనుల అంచనా విలువను బట్టి సూపర్ చెక్‌ను సూపరింటెండెంట్ ఇంజినీర్, చీఫ్ ఇంజినీర్లు చేస్తారు. కానీ, ఆయిల్‌ఫెడ్‌లో ఎటువంటి సూపర్ చెక్‌లకు తావులేదు. ఇదంతా గమనించి చూడగా.. కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్లు రావనే స్వార్థంతో ఆయిల్‌ఫెడ్‌ను గుప్పిట్లో ఉంచుకుంటున్న ఓ అధికారి ఇంజినీర్లను రానివ్వడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ ఇంజినీరింగ్‌శాఖ లేకపోవడంతో అన్ని పనులకు కన్సల్టెంట్లపైనే ఆధారపడుతున్నారు. ప్లాన్లు, అంచనాలు, నాణ్యత తదితర పనులను కన్సల్టెంట్ల నుంచే తీసుకుని చెల్లింపులు చేస్తున్నారు. దీనికి అదనంగా ఖర్చులు చేస్తున్నారు. ఈ అంచనాలు కాంట్రాక్టర్లకు లాభాలు కట్టబెట్టే విధంగా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2019-26 వరకు రూ.148 కోట్ల పనులు..
2019 నుంచి 2026 సంవత్సరం వరకు రూ.148 కోట్లకు టెండర్లు పూర్తయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.65 లక్షలు, 2020-21లో రూ.9.12 కోట్లు, 2021-22లో 21.13 కోట్లు, 2022-23లో రూ.14.62 కోట్లు, 2023-24లో రూ.83.19 కోట్లు, 2024-25లో రూ.4.54 కోట్లు, 2025-26లో రూ.15.01 కోట్ల పనుల్లో గరిష్ట సంఖ్యలో పనులు పూర్తవగా కల్లూరుగూడెం, అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయి.