భద్రాద్రి అడవుల్లో.. మండే ఎండల్లో.. మైళ్ల దూరం నడిచి.. తునికాకు కార్మికులు ఆకు సేకరణ చేసినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. చెట్టుచెట్టూ తిరిగి పుట్టపుట్టా వెతికి తునికాకులు సేకరిస్తున్న కార్మికుల కష్టం ఏటా ఎండల్లోనే ఆవిరైపోతున్నది. ఒకవైపు అడవి జంతువులు, మరోవైపు లభ్యంకాని ఆకులు, ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు గిరిజనులను వెంటాడుతున్నాయి.
అయినప్పటికీ గిరిజనులు వేసవిలో దీనినొక ఉపాధి మార్గంగా ఎంచుకొని తునికాకు సేకరిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం 50 ఆకుల కట్టకు ఎప్పటిలాగానే రూ.3 ధర ఇవ్వడంతో తునికాకు సేకరించిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్ట రేటు పెంచాలని ఏటా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసినా పైసా కూడా పెంచకపోవడం గమనార్హం. శ్రమకు తగ్గ గుర్తింపు ఇవ్వకపోగా సకాలంలో ప్రభుత్వం ఆకు సేకరణ జరపకపోవడంతో మన్యంప్రాంతాల్లో పనుల్లేక గిరిజనులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మే 11 (నమస్తే తెలంగాణ)
అడవిలో చాలాదూరం నడిచి వెళ్తే తప్ప ఆకులు దొరికే పరిస్థితి లేకపోవడంతో తమ వేసవి పంట రానురానూ అంతరించిపోతున్నదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు ఆకు సేకరణకు రావాల్సిన బోనస్ కూడా రాకపోవడంతో గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. గిరిజన సంఘాలు, రాజకీయ నాయకులు ధర్నాలు చేసినా ఫలితం లేకుండాపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేటు పెరగదు.. బోనస్ రాదు..
మైళ్లదూరం వెళ్లి ఆకు సేకరణ చేస్తే కనీసం కూలీమందం కూడా సొమ్ములు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తునికాకు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 ఇచ్చారు. గతంలో కూడా అదే పరిస్థితి. ఈ ఏడాది ధర పెంచాలని డిమాండ్ చేసినా అటవీశాఖ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతోపాటు కార్మికుల బోనస్ కూడా మూడేళ్లుగా రావడం లేదు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కడం లేదంటూ వారు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి జిల్లాలో 25 వేల మంది తునికాకు కార్మికులు ఏటా తునికాకు సేకరిస్తున్నారు. వీరందరికీ ఏటా ఆకు సేకరణ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో రూ.12 కోట్ల వరకూ బోనస్ రావాల్సి ఉంటుంది. 2022 వరకు కార్మికులకు బోనస్ ఇచ్చారు కానీ అప్పటి నుంచి కొత్త సర్కారు ఆ మాట ఎత్తడం లేదు.
అటవీభూమి కనుమరుగు
జిల్లాలో రోజురోజుకూ అడవి అంతరిస్తోంది. సింగరేణి ఉపరితల గనులు విస్తరిస్తుండడం, ప్రభుత్వ భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తుండడం వంటివి కూడా ఇందుకు కారణమవుతోంది. దీనికితోడు పోడు భూమి కూడా ప్రధాన అవరోధంగా ఉంది. వీటి ఫలితంగా అటవీ సంపద కనమరుగవుతున్నది. దుమ్ముగూడెం ప్రాంతంలో అడవి తగ్గిపోవడంతో అక్కడి గిరిజనులు తునికాకు కోసం రాష్ట్ర సరిహద్దు దాటాల్సి వస్తున్నది. మైళ్ల దూరం వెళ్లినా కార్మికులకు ఫలితం దక్కడం లేదు. దీంతో తునికాకు కార్మికులు ఆకు సేకరణపై ఆసక్తి చూపకపోగా అధికారులు సైతం ప్రూనింగ్ పనులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. తునికాకు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
32,600 స్టాండర్డ్ బస్తాల లక్ష్యం
జిల్లాలో ఆరు ఫారెస్టు డివిజన్ల ద్వారా 39 యూనిట్లలో తునికాకు సేకరణ చేయనున్నారు. మణుగూరు డివిజన్లో 5 యూనిట్లలో 5,400 బస్తాలు, పాల్వంచ డివిజన్లో 4 యూనిట్లలో 2,300 బస్తాలు, ఇల్లెందులో 8 యూనిట్లలో 10,600 బస్తాలు, కిన్నెరసాని డివిజన్లో 5 యూనిట్లలో 3,200 స్టాండర్డ్ బస్తాలు, భద్రాచలం డివిజన్లో 5 యూనిట్లలో 9,700 బ్యాగులు, కొత్తగూడెం డివిజన్లో 2 యూనిట్లలో 1,400 బ్యాగులు సేకరించనున్నారు.
ఆదివాసీలపై సర్కారు చిన్నచూపు
ఆదివాసీలు అడవిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఎండల్లో కష్టం చేసేది వాళ్లు మాత్రమే. అలాంటి ఆదివాసీ బిడ్డల కష్టాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 50 ఆకుల కట్టకు రూ.3 ఇస్తున్నారు. ఇది పాత ధర. కొత్తగా కట్టకు రూ.5 ఇవ్వాలంటూ ఏటా ఆందోళనలు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రూనింగ్ పనులు కూడా చేయడం లేదు. ఆదివాసీలపై చిన్నచూపు తగదు.
– అమర్లపూడి రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐకేపీఎంఎస్
బోనస్ ఇవ్వలేదు.. ధర పెంచలేదు..
రెండేళ్లుగా తునికాకు బోనస్ రాలేదు. ఎండల్లో ఆకు సేకరణ చేస్తున్నాం. ధర కూడా పెంచడం లేదు. ఎండల్లో సేకరణ చేయడం చాలా కష్టమైన పని. అడవిలో జంతువులు ఉంటాయి. వాటిని చూసుకుంటూ తప్పించుకుని దాక్కుని మరీ వెళ్లాల్సి ఉంటుంది.
– గొగ్గెల లక్ష్మీనారాయణ, తూరుబాక, గుండాల మండలం
నేటి నుంచి ఆకు సేకరణ
భద్రాచలం, ఇల్లెందు డివిజన్లలో సోమవారం నుంచి తునికాకు సేకరణ జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే కొనుగోలు జరుగుతుంది. బోనస్ డబ్బులు రావాల్సి ఉంది. రాగానే జమ చేస్తాం.
– సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఎఫ్వో, ఖమ్మం