తిరుమలాయపాలెం, జూన్ 23 : ఇందిరమ్మ కమిటీలు ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడాయని, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశాయని ఆరోపిస్తూ తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు, నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించి ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్, సీపీఎం నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.
అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పిండిప్రోలు బస్టాండ్ సెంటర్లో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులు, మహిళలతో చర్చించారు. అనంతరం ఆందోళనకారులు తిరుమలాయపాలెం చేరుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీడీవో షేక్ శిలార్ సాహెబ్‌కు వినతిపత్రం సమర్పించారు.
పిండిప్రోలు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, జాబితా నుంచి అనర్హులను తొలగించి అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని, ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పరికపల్లి చంద్రశేఖర్, చామకూరి సునీల్, శంకర్, సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, పద్మనాభుల సుధాకర్, పప్పుల ఉపేందర్, కాంపాటి బాబు, రామనబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.