ఇంటర్ ఫలితాలు విడుదలైనా మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు మాత్రం రెమ్యూనరేషన్ ఇంకా అందలేదు. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నా స్పాట్ నిర్వహించిన అధ్యాపకులకు నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. మూల్యాంకనంలో కీలకపాత్ర పోషించిన అధ్యాపకులకు మాత్రం నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రెమ్యూనరేషన్ చెల్లించలేదు. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నయాబజర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా మూల్యాంకన ప్రక్రియ జరిగింది. సైన్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు ఈ స్పాట్లో పాల్గొన్నారు. కానీ, ప్రభుత్వం వీరి బిల్లులను ఇంకా క్లియర్ కాకపోవడంతో అధ్యాపకుల్లో అసహనం పెరుగుతోంది. అదనపు సమయం కేటాయించి మూల్యాంకనంలో సమాధానప పత్రాలు దిద్దినప్పటికీ తమకు రావాల్సిన పారితోషికం పెండింగ్‌లో ఉండడంతో అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-ఖమ్మం అర్బన్, మే 10
పదుల ఏళ్ల అనుభవం కలిగిన అధ్యాపకులు పలు సంవత్సరాలుగా మూల్యాంకన ప్రక్రియలో పాల్గొంటున్నారు. అయితే, గత రెండేళ్లుగా జరుగుతున్న ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ పట్ల వీరే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంటర్ విద్యావ్యవస్థ ఎటుపోతుందో తమకు అర్థంకాని పరిస్థితి నెలకొంటోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్ సమయాల్లో మార్పులు చేసినా, నిబంధనలకు మించి పేపర్లు దిద్దించినా వీరు సర్దుకుపోయారు. కానీ, వారికి పారితోషికం అందించాల్సిన ప్రభుత్వం.. సకాలంలో అందించకుండా నెలల తరబడి జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇంతటి జాప్యం ఉండేదికాదని, రోజుల వ్యవధిలోనే రెమ్యూనరేషన్ నిధులు విడుదలయ్యేవని కొందరు సీనియర్ అధ్యాపకులు గుర్తుచేస్తున్నారు.
‘గత ప్రభుత్వంలో ఇలా ఉండేదికాదు. స్పాట్ విధుల్లో పాల్గొన్న వారికి రెమ్యూనరేషన్‌ను ఆన్లైన్ ద్వారా చెల్లించేవారు. తొలుత అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు ఇచ్చిన అకౌంట్ల ప్రకారం ప్రభుత్వం ఏఈ (అసిస్టెంట్ ఎగ్జామినర్లు)లకు, సీఈ (చీఫ్ ఎగ్జామినర్లు)లకు, స్క్రూటినైజర్లకు, విషయ నిపుణులకు స్పాట్ ముగిసిన రెండు రోజుల్లోనే చెల్లించేది.’ అంటూ చెబుతున్నారు. ‘చెల్లింపులు పూర్తయిన తర్వాత ఆడిటింగ్ ప్రక్రియ నిర్వహించే వారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఏసీవోలు బాధ్యులుగా ఉండేవారు. గడిచిన పదేళ్లలో రెమ్యూనరేషన్ చెల్లింపుల్లో రూపాయి కూడా వ్యత్యాసం రాలేదు’ అంటూ ఓ సీనియర్ ప్రిన్సిపాల్ పేర్కొనడం గమనార్హం.
నెలల తరబడి ఎదురుచూపులు..
అయితే, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో.. ఇంటర్మీడియట్ క్యాంపు ముగిశాక.. బోర్డు నియమించుకున్న ప్రైవేట్ ఆడిటర్లకు బిల్లులు వెళ్తున్నాయి. ఆడిటర్లు అడిట్ చేసి జాయింట్ సెక్రటరీకి అకౌంట్ల జాబితా అందజేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ నుంచి సీవోఈ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్)కి వస్తున్నాయి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్.. ఇంటర్ బోర్డు సెక్రటరీ అనుమతి తీసుకొని పేమెంట్స్ చేయడానికి రెండు మూడు నెలల సమయం తీసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న అధ్యాపకులకు ఆ పారితోషికం నగదు ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి. దీంతో స్పాట్లో పాల్గొన్న అధ్యాపకులకు ప్రతిరోజూ ఎదురుచూపులు తప్పడం లేదు.
అధ్యాపకుల ఆవేదన..
మూల్యాంకన ప్రక్రియను భుజాన మోసిన అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఫలితాల విడుదలలో ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో నిబంధనలకు తిలోదకాలిచ్చి, నిర్ణీత సమయానికి మించి పేపర్లు దిద్దించినా; బోర్డు ఆదేశాల మేరకు రేయింబవళ్లూ కష్టపడి మూల్యాంకనం పూర్తిచేసినా ప్రభుత్వం మాత్రం తమపట్ల సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. నెలలు గడిచిపోతున్నా ఇప్పటికీ రెమ్యూనరేషన్ విడుదల చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెల్లడై నెలరోజులు దాటిపోయినా అటు ప్రభుత్వం, ఇటు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. రెమ్యూనరేషన్ ఆలస్యం గురించి అడిగితే జిల్లా అధికారులు ఒకలా, ఇంటర్ బోర్డు అధికారులు మరోలా సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన ఉండడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సప్లిమెంటరీ మూల్యాంకనంపై ప్రభావం !
ఇప్పటికైనా బకాయిలు వెంటనే విడుదల చేయాలని, గతంలో మాదిరిగానే స్పాట్ ముగిసిన రోజే చెల్లింపులు చేయాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనాన్ని నిరవధికంగా బహిష్కరిస్తామని అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు. అయితే, చెల్లింపులు జరగకపోవడం వల్ల మూల్యాంకనం నిలిచిపోతే ఎదురయ్యే ప్రభావాలపై విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వెంటనే చెల్లించాలి..
మూల్యాంకనం రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి. ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్కృతం లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కాలేజీల యాజమాన్యాలు ఇచ్చే 7, 8 నెలల జీతాలతోనే కుటుంబాలు నెట్టుకొస్తున్నాం. వేసవిలో మూడు నెలలపాటు స్పాట్ రెమ్యూనరేషనే మాకు మరో ఆధారం. అది కూడా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది.
-ఏ.ప్రభాకరశర్మ, సంస్కృతం లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉన్నతాధికారులకు నివేదించాం..
ఇంటర్మీడియట్ మూల్యాంకనం పూర్తయిన వెంటనే రెమ్యునరేషన్‌కు సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు నివేదించాం. ఒకటి, రెండు సబ్జెక్టులకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా రావడంతో ప్రక్రియ కొంత ఆలస్యమైంది. సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి. రెమ్యూనరేషన్ చెల్లింపులు త్వరలోనే జరుగుతాయి.
-కే.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఖమ్మం