బోనకల్లు, మార్చి 14 : పాలకుల విధానాల వల్ల రైతులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు హెచ్చరించారు. బోనకల్లు మండలంలోని గోవిందాపురం (ఎల్) లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తమ్మారపు భద్రయ్య ప్రాంగణంలో జక్కుల రామారావు అధ్యక్షతన మూడో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1936లో స్వాతంత్ర్య సంగ్రామంలో రైతులను ఐక్యపరిచేందుకు ఏఐకేఎస్ ఏర్పడిందన్నారు. నాటినుండి నేటి వరకు రైతు వ్యతిరేక విధానాలను అవలంభించే ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో 10 లక్షల ఎకరాలు రైతుల చేతుల్లోకి వచ్చాయన్నారు. అప్పటి వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ప్రస్తుత ఖమ్మం జిల్లాలో దాదాపు 49 వేల ఎకరాలను పేదలకు పంపిణీ చేయడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణమన్నారు. ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వాలు అలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పాలకుల తప్పుడు విధానాలతో, నల్ల చట్టాలతో రైతులకు అన్యాయం చేస్తుంటే మరోవైపు వాతావరణంలోని మార్పులు, అతివృష్టి ,అనావృష్టి లాంటి రుగ్మతలు, అంతు చిక్కని వైరస్లతో రైతులు ఎన్నడూ చూడని తీవ్రమైన కష్టాలను చూస్తున్నారన్నారు. పండిన పంటకు ధర నిర్ణయించే హక్కు రైతుకు లేకపోవడంతో పంట గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కాల్వల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటే పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బులు ఎటు పోతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా పాలకులు రైతు సమస్యలపై దృష్టి సాధించి రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు.
అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ముష్టికుంట్ల గ్రామానికి చెందిన కొంగర భాస్కరరావు, ప్రధాన కార్యదర్శిగా కలకోట గ్రామానికి చెందిన ఏలూరి పూర్ణచందర్రావు, గౌరవ అధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పారుపల్లి నరసింహారావుతో పాటు 6 మంది ఆఫీస్ బేరర్స్, 11 మంది కార్యవర్గ సభ్యులు, 15 మంది కౌన్సిల్ సభ్యులతో మొత్తంగా 35 మందిని మండల కమిటీగా ఎన్నుకోన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, బోనకల్లు మండల కార్యదర్శి ఎంగల ఆనందరావు , జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, మండల సహాయ కార్యదర్శి ఆకిన పవన్ , ఏఐకేఎస్ జిల్లా నాయకులు ఏలూరి పూర్ణచంద్రరావు, కలకోట మోటమర్రి సొసైటీ డైరెక్టర్లు మరీదు వెంకటేశ్వర్లు, బుర్రి నాగేశ్వరరావు , రైతులు షేక్ బ్రహ్మం, ఏనుగు రామకృష్ణ, కొంగర కృష్ణయ్య, మాతంగి శ్రీనివాసరావు పాల్గొన్నారు.