పాల్వంచ రూరల్, జనవరి 16: తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో తొలిసభను నిర్వహిస్తున్నట్లు ఎంపీ నామా నాగేశ్వరావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు,మాజీ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. త్వరలో ఢిల్లీలో ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.
పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా స్వగృహంలో సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ నామా మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ పథకాల కోసం ఇతర రాష్ర్టాల ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొరవతో భద్రాద్రి జిల్లా కొద్ది నెలల్లో రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారనున్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ అభిమానులు గజమాలతో సత్కరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సింగరేణి కార్మిక నాయకుడు వెంకట్రావు, జడ్పీచైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపూరి రాజూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.