పాల్వంచ రూరల్, మార్చి 26: పెద్దమ్మతల్లి ఆలయ కమిటీలో తమకు సముచితస్థానం లభించలేదని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల ప్రజలు బుధవారం ఆలయం వద్ద ఆందోళన చేశారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాగా ఆ రెండు గ్రామాల ప్రజలు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్న తమకు పాలకమండలిలో ప్రాధాన్యం కల్పించాలని, స్థానికేతరులకు, అనుభవంలేని వారికి కమిటీలో స్థానం కల్పించొద్దని నినాదాలు చేశారు. ఇద్దరు యువకులు పక్కనే ఉన్న వాటర్‌ట్యాంక్ ఎక్కడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
తమ గ్రామాల వారికి ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చేంతవరకు ట్యాంకు దిగమని హెచ్చరించారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి వీలులేదని ఆ రెండు గ్రామాల ప్రజలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. పాల్వంచ సీఐ, ఎస్ఐలు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. ఈ విషయమై ఆలయ ఈవో రజనీకుమారి మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాణస్వీకారం నిర్వహించడంలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు.