కట్టంగూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించే స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతకు (Cleanliness) అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఏ అధికారి శేఖర్ రెడ్డి (DRDA Shekhar Reddy) అన్నారు. శనివారం కట్టంగూర్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు ఉపాధిహామీ పనుల రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ప్రజలు, స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి మొక్కలు నాటాలని సూచించారు. అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈజీఎస్ సిబ్బంది ఉపాధి కూలీలకు ఈ కేవైసీ చేయించడంతో పాటు జాబ్ కార్డు అప్డేట్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం అధికారులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. జల సంచయ్, జల భగీరథ కార్యక్రమానికి జిల్లాకు జాతీయ అవార్డు వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, ఏపీడీ నర్సింహ్మరావు, డీపీఎం మోహన్ రెడ్డి, ఎంఈవో అంబటి అంజయ్య, ఎంపీవో స్వరూపారాణి, ఏపీవో కడెం రాంమోహన్, ఏపీఎం రాములు, టీఏ, సీసీ, సీఓ, వీఓఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.