మండుటెండలో తునికాకు సేకరిస్తున్న గిరిజనుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. గిరిజనుల మూడోపంటగా ఉన్న తునికాకు సేకరణ రానురాను దూరాభారం, కష్టతరం అవుతున్నది. ఒకవైపు పోడు ద్వారా కొంత అడవి దూరం కాగా.. మరోవైపు ఓసీ పేరుతో అటవీ భూమి సింగరేణిపరం కావడంతో గిరిజనులకు తునికాకు సేకరణ తలకు మించిన భారంగా మారింది. అడవిలో ఆకు సేకరణకు కష్టాలు తప్పడం లేదు. వేసవిలో చాలాదూరం నడిచి వెళ్తే తప్ప ఆకులు దొరికే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. సరైన రేటు లేకపోవడం, ఏటా బోనస్ సొమ్ములు కూడా రాకపోవడంతో గిరిజనులు ఆకు సేకరణపై ఆసక్తి చూపడం లేదు. చివరకు తునికాకు ఉనికి కోల్పోయే పరిస్థితులు దాపురించాయి. ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోతున్నదని గిరిజన సంఘాలు, రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 25 (నమస్తే తెలంగాణ)
ఏటికేడాది గిరిజనులు ఎంతో కష్టపడి తునికాకు సేకరిస్తుంటే వారి రెక్కల కష్టానికి సరైన రేటు లేకపోవడంతో అడవిలో కాలినడక వృథాగానే మిగిలిపోతున్నది. మైళ్లదూరం వెళ్లి ఆకు సేకరణ చేస్తే కనీసం కూలిమందం కూడా సొమ్ములు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తునికాకు కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చొప్పున ఇచ్చారు. గతంలో కూడా అదే పరిస్థితి.. ఈ ఏడాది రేటు పెంచాలని డిమాండ్ చేసినా అటవీ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విచారకరం. దీంతోపాటు కార్మికులకు రావాల్సిన బోనస్ కూడా కొంత కాలంగా రాకపోవడంతో తమ కష్టానికి ఫలితం దక్కడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25 వేల మంది తునికాకు కార్మికులు ఏటా తునికాకు సేకరిస్తున్నారు. వీరందరికీ ఏటా ఆకు సేకరణ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో రూ.11 నుంచి రూ.12 కోట్ల బోనస్ రావాల్సి ఉంటుంది. 2021 వరకు కార్మికులకు బోనస్ ఇచ్చారు. కానీ.. అప్పటినుంచి కొత్త సర్కారు ఆ మాట ఎత్తడం లేదు.
గిరిజన జిల్లాలో ఎక్కువగా ఉండాల్సిన అడవి రానురాను కనుమరుగవుతున్నది. పోడు ద్వారా కొంత అడవిపోగా, మరోవైపు ప్రభుత్వమే అటవీ భూమిని తీసుకోవడం వల్ల అటవీ సంపద తగ్గిపోతున్నది. ఇల్లెందు నియోజకవర్గంలో ఓపెన్‌కాస్టు కోసం సింగరేణి అటవీ భూమిని తీసుకుంది. దీంతో అక్కడ అటవీ సంపద కనుమరుగైంది. దీంతోపాటు భూసారం కూడా తగ్గిపోవడంతో తునికి చెట్లు మాయమైపోతున్నాయి. దుమ్ముగూడెం ప్రాంతంలో అడవి తగ్గిపోవడంతో అక్కడ గిరిజనులు తునికాకు కోసం రాష్ట్ర సరిహద్దులు దాటాల్సి వస్తున్నది. మైళ్ల దూరం నడిచి వెళ్లినా కార్మికులకు ఫలితం దక్కడం లేదు.
జిల్లాలో ఆరు డివిజన్ల ద్వారా 39 యూనిట్లలో తునికాకు సేకరణ చేస్తున్నారు. మొత్తం 32,600 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా ఉంది. మణుగూరు డివిజన్లోని 5 యూనిట్లలో 5,400 బస్తాలు, పాల్వంచ 4 యూనిట్లలో 2,300, ఇల్లెందు 8 యూనిట్లలో 10,600, కిన్నెరసాని 5 యూనిట్లలో 3,200, భద్రాచలం 5 యూనిట్లలో 9,700, కొత్తగూడెం 2 యూనిట్లలో 1,400 బస్తాలు సేకరించనున్నారు.
తునికాకు సేకరణ చాలా కష్టంగా మారింది. ప్రూనింగ్ పనులు సమయానికి చేయకపోవడం వల్ల కూడా ఆకులు చిగురించడం లేదు. కాలబెట్టడం వల్ల చెట్లు మోడుగా మారిపోతున్నాయి. సమయానికి వానలు పడకపోవడంతో మోడు చిగురించడం లేదు. గతంలో బోనస్ డబ్బులు రాలేదు. రేటూ పెరగడం లేదు. తునికాకు సేకరణపై ఆసక్తి తగ్గిపోతున్నది.
– వీరాస్వామి, తునికాకు కార్మికుడు, ముత్తారం, గుండాల మండలం
జిల్లాలో ఇప్పుడే ప్రూనింగ్ పనులు పూర్తిచేశాం. మొత్తం 39 యూనిట్లలో ఆకు సేకరణ జరుగుతుంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి తునికాకు సేకరణ చేస్తారు. ప్రస్తుతం తునికాకు కట్ట రూ.3 ఉంది. పెంచడానికి ప్రతిపాదన చేశాం. కార్మికుల ఖాతాల్లోనే బోనస్ జమ అవుతుంది. జిల్లాలో 32,600 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా ఉంది.
– కృష్ణగౌడ్, డీఎఫ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం