ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 : తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తూ.. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని సమాజం కోల్పోవడం చాలా బాధాకరమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి రెడ్డిపల్లిలో రామయ్య మృతదేహంపై మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వనజీవి రామయ్య తపనంతా మొక్కలు పెంచడం, సంరక్షించడమేనని.. కోటికి పైగా మొక్కలు నాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
మరణించేంత వరకు వన సంరక్షణే ధ్యేయంగా శ్రమించి, భావితరాలకు స్ఫూర్తి నింపారన్నారు. అలాంటి మహానుభావుడి మృతి రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ బాబు, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మారెమ్మ దేవస్థానం చైర్మన్ టి.వీరారెడ్డి, కానుగుల రాధాకృష్ణ, పంతులు నాయక్, రామ్మూర్తి నాయక్, లింగాల రవికుమార్, కార్పొరేటర్ నిరంజన్, సీపీఐ నేత మౌలానా, బోడా వెంకన్న, పాపా నాయక్, మొగిలిచర్ల సైదులు పాల్గొన్నారు.