అశ్వారావుపేట, జూలై 17: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి అంతా గోతులమయంగా మారింది. పట్టపగలు ముందు వాహనం వెళ్తుంటే దాని వెనుక వెళ్లే వాహనదారుడు తప్పనిసరిగా లైట్లు వేసుకొని వెళ్లాల్సిందే. అంటే.. దుమ్ము ధూళి తీవ్రత ఆ స్థాయిలో ఉంటుందన్నట్లు. ఇది ఒక్కరోజూ.. రెండు రోజుల సమస్య కాదు. ఏడాది నుంచి పట్టణ ప్రజలకు నిత్యకృత్యంగా మారింది.
నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగించే హైవే అధ్వానంగా మారినా పట్టించుకునే ప్రజాప్రతినిధులు, అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గురువారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం.. దుమ్ము ధూళి లేవకుండా నీటిని క్యూరింగ్ చేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. పొద్దుపోయేకొద్దీ తెలిసింది.. పట్టణవాసులకు అసలు విషయం.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఈ తతంగమంతా పూర్తి చేసినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. మంత్రి పర్యటన ముగిసిన తర్వాత నీటిని క్యూరింగ్ చేసే వాహనాలు కనిపించకపోవడం.. దుమ్ము ధూళి వ్యాపించడం యథాతధంగా మారింది. ఎంతైనా ఓట్లు వేసిన ప్రజల కంటే.. ప్రజల ఓట్లతో గెలిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకే సమస్యలు లేకుండా చూస్తారా? అంటూ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో ఏడాది కాలంగా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయనేది ఎవరికీ తెలియని పరిస్థితి.