అనుకున్నదే అవుతోంది. ‘మాట తప్పడంలో కాంగ్రెస్ సర్కారుకు పెట్టింది పేరు’ అనే యథార్థం ప్రతి ఒక్కరికీ బోధపడుతోంది. ‘ద్రోహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దానికదే బ్రాండ్’ అంటూ సాధారణ ప్రజలు కూడా సంభాషించుకుంటున్నారంటే ప్రజల్లో అది ఎంతలా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘కాంగ్రెస్ అంటేనే మాట తప్పే సర్కారు’ అంటూ అన్ని వర్గాల ప్రజల్లో ఇప్పటికే బలమైన ముద్ర ఉందంటే అతిశయోక్తి కాదు. అధికారం ‘చే’జిక్కించుకునేందుకు నోటికొచ్చిన హామీలను ఇచ్చినప్పటి నుంచి వాటిని అమలు చేసే విషయంలో మాట తప్పుతున్న అంశాల వరకూ అన్నింట్లోనూ అదే తీరంటే ఆశ్చర్యమే లేదు.
ముఖ్యంగా రెండు నెలల క్రితం సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఇచ్చిన మాటను కూడా తాజాగా తప్పడంతో పేద ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడుతోంది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అనే నాలుగు పథకాలను రెండు నెలల క్రితం అంటే సాక్షాత్తూ గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభించింది. హామీల అమలు విషయంలో ఆనాటి సభలోనే ముఖ్యమంత్రి అనేకసార్లు మాటలు మార్చారు.
చివరికి ‘మార్చి 31’ అంటూ గడువు పెట్టారు. కానీ, నిన్నటితో ఆ గడువు కూడా ముగిసిపోయింది. కానీ ఆ నాలుగు పథకాలను అమలు చేసిందీ లేదు. మాటను నిలబెట్టుకున్నదీ లేదు. ముఖ్యంగా యాసంగి పంటల కోతల సమయం దగ్గర పడుతున్నప్పటికీ రైతులకు కనీసం రైతుభరోసా ఇచ్చిన పుణ్యమూ లేదు. దీంతో అందరినోటా ఒకేమాట. అదే.. ‘మళ్లీ దగా.. అదే ధోకా..’. -భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 31 (నమస్తే తెలంగాణ)
‘ఆరు గ్యారెంటీల్లో భాగంగా నాలుగు పథకాలను ఇప్పుడు అమలుచేస్తున్నాం. పైలట్ గ్రామాల్లో ఈ పథకాలను తక్షణమే అమల్లోకి తెస్తున్నాం. మిగతా గ్రామాల్లో మార్చి 31లోగా అమలుచేస్తాం. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అర్హత ఉండి ఎన్ని ఎకరాలు సాగుచేస్తున్న రైతుకైనా మార్చి 31లోపు రైతుభరోసాను జమచేస్తాం’ అంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జనవరి 26న జరిగిన నాలుగు పథకాల ప్రారంభ సభ సాక్షిగా సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
అయితే, పైలట్ గ్రామాల్లోనే ఆ పథకాలు అమలుకు నోచుకోలేదు. ఇక మిగతా గ్రామాల ప్రజలదీ అదే పరిస్థితి నెలకొంది. అయితే, ఇచ్చిన గడువు మేరకు మార్చి 31లోగా తమకు రైతుభరోసా జమ అవుతుందేమోనని ఆశించిన రైతులకు చివరికి ఆశాభంగమే ఎదురైంది. ముఖ్యమంత్రి పెట్టిన గడువు ముగిసినప్పటికీ భద్రాద్రి జిల్లాలో ఐదు ఎకరాలకు పైబడి సాగుభూమి ఉన్న రైతులకు రైతుభరోసా జమ కాలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది వానకాలం సాగుకు అందాల్సిన రైతుభరోసా రానేలేదు. మార్చి 31 అంటూ గడువు పెట్టిన యాసంగి సీజన్ రైతుభరోసాకూ అతీగతీ లేదు. దీంతో యాసంగి వరిసాగు కోతల దశకు చేరుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో రైతుభరోసా జమచేయకపోవడం, ఇప్పటి వరకూ ఐదెకరాల్లోపున్న రైతులకు రోజుకు కొద్దిమంది చొప్పున ప్రహసనంలా జమ చేస్తుండడం, ఇంకా జమ కావాల్సిన రైతులకే సింహభాగం నిధులు కావాల్సి ఉండడం, మార్చి 31 గడువు దాటినా వాటికి జమచేస్తారో లేదోనన్న సందేహాలు వెల్లువెత్తుతుండడం వంటి కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఫోన్లు చూసుకుంటున్నా, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్చేసుకుంటున్నా రైతుభరోసా మాత్రం కాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐదెకరాలకు పైబడిన రైతులకు జమకాని ‘భరోసా’
జిల్లాలో 1,80,718 మంది రైతులున్నారు. వారిలో ఇప్పటివరకు ఐదెకరాల్లోపు సాగుభూమిని కలిగి ఉన్న 1,37,718 మంది రైతులకు రైతుభరోసా పంటల పెట్టుబడి సాయం అందింది. ఇంకా ఐదెకరాలకు పైబడి సాగుభూమి కలిగి ఉన్న 43 వేల మంది రైతులకు జమ కావాల్సి ఉంది. జిల్లాలో యాసంగిపంట సాగుచేసిన రైతులకు రూ.333 కోట్లు రైతుభరోసా రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.163.20 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ 43 వేల మంది రైతులకు ఇంకా సుమారు రూ.170 కోట్లు జమ కావాల్సి ఉంది. అంటే ఇప్పటి వరకూ ఐదెకరాల్లోపు ఉన్న 1,37,718 రైతులకు అందించిన సాయం కంటే.. ఐదెకరాలకు పైబడి ఉన్న 43 వేల మంది రైతులకు అందాల్సిన రైతుభరోసా నిధులే అధికం. అయితే గడువు ముగిసినందున అవి అందుతాయో లేదోనని అన్నదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాలం కూడా అయిపోతోంది..
యాసంగి సీజన్ కూడా అయిపోతోంది. మరో రెండు నెలలైతే వానకాలం సీజన్ కూడా మొదలవుతుంది. కానీ ఇప్పటి వరకు రైతుభరోసా రాలేదు. రోజూ ఫోన్లో మెసేజ్‌లు చూసుకుంటున్నాను. కానీ రైతుభరోసా జమ అయిన మెసేజ్ మాత్రం రావడం లేదు. బ్యాంకుకు వెళ్లి వాకబు చేసినా జమకాలేదనే చెబుతున్నారు. అసలే పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు పంటల సాయం కూడా ఇవ్వకుండా మాలాంటి రైతులను మోసం చేస్తే ఎలా?
-మద్దిరాల చిన పిచ్చయ్య, రావికంపాడు, చండ్రుగొండ
నిన్న కూడా చూశాను.. జమ కాలేదు..
సీజన్లో పంట వేసినప్పుడు పెట్టుబడి సాయం ఎంతో అవసరముంటుంది. అప్పుడు జమ చేస్తే వ్యవసాయ పనులకు అక్కరకొస్తాయి. అవి అందకపోవడం వల్లనే వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీజన్‌కు ముందే ఇవ్వడం లేదు. సీజన్ ముగిశాక ఇస్తే ఏం ఉపయోగం? సీజన్‌కు ముందే రాకపోవడంతో అప్పు తెచ్చుకొని మరీ ఎరువులు, పురుగుమందులు తెచ్చుకున్నాం. కనీసం పంటకు నీళ్లు పెట్టుకునే సమయానికీ ఇవ్వలేదు. నేను నిన్ననే బ్యాంకుకు వెళ్లి చూసుకున్నా. భరోసా ఇంకా జమ కాలేదు.
-కుంజా కృష్ణ, రామన్నగూడెం, ములకలపల్లి
రైతుభరోసాపై ముఖ్యమంత్రి మాట తప్పారు..
మార్చి 31 నాటికి రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా జమచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. గడువు దాటినా జమ చేయకుండా మాట తప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇలా అనేకసార్లు గడువులు పెట్టి మాట తప్పిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మార్చి 31న నాటికి రైతులందరికీ రైతు భరోసా నిధులు అందజేస్తామని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కూడా మరోసారి చెప్పారు. కానీ ఇవ్వకుండా రైతులను మరోసారి మోసం చేశారు.
-లకావత్ గిరిబాబు, బీఆర్ఎస్ నాయకుడు
అందరికీ సాయం అందుతుంది..
ఐదు ఎకరాల్లోపు సాగుభూమి ఉన్న రైతులకు నిన్నటి వరకు రైతుభరోసా జమ అయింది. ఐదు ఎకరాలకు పైబడి పంటభూములు ఉన్న రైతులకు కూడా తప్పక అందుతుంది. అర్హత ఉన్న రైతులు ఎన్ని ఎకరాలు సాగుచేస్తున్నప్పటికీ వారందరికీ రైతుభరోసా కింద పంటల పెట్టుబడి సాయం అందుతుంది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆలస్యం అవుతున్నప్పటికీ రైతుభరోసా జమ అవుతుంది.
-బాబూరావు, డీఏవో, భద్రాద్రి