ఖమ్మం జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. పైలట్ గ్రామాల్లో వెంటనే ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో ఉన్న కొద్దిపాటి ఇండ్లను (రేకుల ఇళ్లు, గుడిసెలు, పెంకుటిళ్లు) కూల్చి కొత్తవి కట్టుకోవడం ప్రారంభించారు. కొందరివి బేస్మెంట్ లెవల్, మరికొందరివి రూఫ్ లెవల్ పూర్తయ్యాయి. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క బిల్లు కూడా రాలేదు.
నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మొదటి విడత బిల్లుల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ నెల 15న హైదరాబాద్‌లో కొద్దిమంది లబ్ధిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి మొదటి విడత కింద రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. రెండు మూడు రోజుల్లో మిగతా లబ్ధిదారుల ఖాతాల్లో సంబంధిత నిధులు జమ చేయాలని ఆదేశించారు. కానీ అవి ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయో ఏమోనని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.
– ఖమ్మం, ఏప్రిల్ 16
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్నది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కలిసి 17,500 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు పైలట్ గ్రామాల కింద ఎంపిక చేసిన 20 గ్రామాల్లో 839 మందిని మాత్రమే ఎంపిక చేశారు. మొత్తం 17,500 ఇళ్లలో కేవలం 839 మాత్రమే మంజూరు చేయగా.. వాటిలో 236 ఇళ్లు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. చింతకానిలో రేపల్లెవాడ, ఖమ్మంరూరల్ మండలంలో ఆరెంపుల, కామేపల్లిలో పొన్నెకల్, కొణిజర్లలో చిన్నగోపతి, కల్లూరులో ఈస్ట్ లోకవరం, కూసుమంచిలో ధర్మాతండా, బోనకల్లో గార్లపాడు, తిరుమలాయపాలెంలో ఏలువారిగూడెం, నేలకొండపల్లిలో కొంగర, రఘునాథపాలెంలో మల్లెపల్లి, ముదిగొండలో ఖానాపురం, ఎర్రుపాలెంలో రాజులదేవరపాడు, మధిరలో చిల్కూరు, సత్తుపల్లిలో కొత్తూరు, వైరాలో పుణ్యపురం, తల్లాడలో కొడవిమిట్ట, సింగరేణిలో కొత్తతంగా, పెనుబల్లిలో రామచంద్రాపురం, వేంసూరులో చిన్నమల్లెల, ఏన్కూరులో రేపల్లెవాడను ఎంపిక చేశారు. ఈ మొత్తం గ్రామాల్లో కేవలం 850 మందిని మాత్రమే ఎంపిక చేశారు.
ఖమ్మంజిల్లాలోని 20 మండలాల ఎంపీడీవోలు ఆయా మండలాల్లోని పైలట్ గ్రామాలకు చెందిన మొత్తం 1,380 మంది లబ్ధిదారులను ఆన్లైన్లో పొందుపర్చారు. వీరిలో జిల్లా కలెక్టర్ 965 మందికి అప్రూవల్ ఇవ్వగా.. 839 మందికి ఇళ్లు మంజూరు చేశారు. వీరిలో 547 మంది ఇంటి స్థలాలను ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారికి ఇచ్చిన ప్రత్యేక యాప్‌లో జియో ట్యాగ్ చేయగా.. వారిలో కేవలం 236 మంది మాత్రం ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. వీరిలో కొంతమంది బేస్మెంట్ లెవల్ నిర్మించుకోగా మరికొందరు రూప్‌లెవల్ వరకు కూడా నిర్మాణం చేశారు. వీరందరి నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేశారు. వీరికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదు.
ఇందిరమ్మ లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తున్నది. వీటిని కూడా నాలుగు విడతలుగా అందించేలా నిర్ణయించింది. లబ్ధిదారుడు ఇంటి పనులు ప్రారంభించి బేస్మెంట్ లెవల్ పూర్తికాగానే రూ.లక్ష, రూప్ లెవల్‌కు మరో లక్ష, స్లాబ్ పూర్తికాగానే రూ.2 లక్షలు, పనులన్నీ పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష ఇవ్వనున్నారు. అయితే ఇప్పటివరకు ఖమ్మంజిల్లాలో ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా బిల్లు చెల్లించకపోవడం విశేషం.
ఖమ్మం జిల్లా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వారికి వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇళ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారు వెంటనే పనులు మొదలుపెట్టాలి. బిల్లులు వెంటనే వస్తాయి.
– బానోతు శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ, ఖమ్మం జిల్లా