ఖమ్మం రూరల్, మే 3 : కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ పార్టీలని, బీఆర్ఎస్ మాత్రమే మన ఇంటి పార్టీ అని, బీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కోరారు. నామా విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌తో కలిసి మండలంలోని మంగళగూడెం, తీర్ధాల, గోళ్లపాడు గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం చేశారు. మండుటెండలో ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కందాల మాట్లాడుతూ మన సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో కొట్లాడే నామా నాగేశ్వరరావుకు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మోసపోమని, కచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి గుండెల్లో పెట్టుకుంటామని పలువురు కూలీలు భరోసా ఇచ్చారు. సుడా మాజీ డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.