తిరుమలాయపాలెం, మే 24 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్తులు మంత్రి పొంగులేటిని నిలదీశారు. పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ధనవంతులు, అనర్హులకే ఇందిరమ్మ కమిటీ వారు ఇళ్లు మంజూరు చేయించారని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరపాలని తహసీల్దారు విల్సన్‌ను ఆదేశించారు. రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.