కారేపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని దోషుల్లో ఒకరికి ఉరి, మిగతావానికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం హర్షనీయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం కారేపల్లిలో జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2018లో అమృతను ప్రణయ్ కులాంతర వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు అలుడైన ప్రణయ్‌ను హత్య చేయటానికి సుఫారీ గ్యాంగ్‌కు అప్పగించి హత్య చేయించాడన్నారు.
ఈ హత్యలో పాలుపంచుకున్న రెండో ముద్దాయికి ఉరి శిక్ష, మిగితా వారికి యావజ్జీవ శిక్ష విధించడంతో కులదురహంకారులకు చెప్పపెట్టు వంటిదన్నారు. భవిష్యత్‌లో కులదురహంకారులు భయపడే విధంగా తీర్పు ఉందని, న్యాయస్ధానాలపై విశ్వాసం పెరిగేలా తీర్పు ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యనమనగండ్ల రవి, గిరిజన సంఘం నాయకులు వజ్జా రామారావు, అజ్మీర శోభన్, బానోత్ బన్సీలాల్, కేవీపీఎస్ నాయకులు ఎజ్జు రత్నం, తలారి దేవ ప్రకాశ్, ఐద్వా మండల కార్యదర్శి కొండబోయిన ఉమావతి, సురబాక ధనమ్మ పాల్గొన్నారు.