కారేపల్లి, జూన్ 14 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మేకలతండాకు చెందిన బానోత్ రామ్మూర్తి -విజయ దంపతుల కుమారుడు లక్ష్మీ వరప్రసాద్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్)గా ఎంపికయ్యాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ ఫలితాల్లో లక్ష్మీవరప్రసాద్ 256వ ర్యాంక్ సాధించాడు.
లక్ష్మీవరప్రసాద్ కారేపల్లిలోని హోలీ ఫెయిత్ స్కూల్లో ప్రాథమిక విద్యను, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో డిగ్రీ, సోషియాలజీలో పీజీ పూర్తి చేశాడు. యుపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ ఎగ్జామ్‌లో ప్రతిభ కనబరచడంపై కారేపల్లి మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మీ వరప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. మారుమూల గిరిజన తండా అయినప్పటికీ బానోత్ రామ్మూర్తి తన ఇద్దరు కూతుళ్లను ఎంబీబీఎస్ చదివించడం, ప్రస్తుతం సీఏపీఎఫ్‌కు ఎంపిక కావడంపై మేకలతండా వాసులు అభినందనలు తెలిపారు.
CAPF (Assistant Commandant) పరీక్ష అనేది కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPF)లో అసిస్టెంట్ కమాండెంట్లను (AC) నియమించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే వార్షిక పరీక్ష. ఈ దళాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అలాగే సశస్త్ర సీమా బల్ (SSB) ఉన్నాయి. అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో పారామిలిటరీ దళాలలోకి నేరుగా ప్రవేశించడానికి ఈ పరీక్ష ఒక ప్రవేశ ద్వారం.