రామయ్యస్వామి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతుడై భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు కొలువుదీరాడు.. తొలిరోజు బుధవారం భక్తులకు మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. ఉదయం ప్రాకార మండపంలో అర్చకులు నిత్య కల్యాణమూర్తులు, ఉత్సవమూర్తులకు అభిషేకం, తిరుమంజనం చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తులను బేడా మండపంలోకి తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో వేదపండితులు నాళాయిర దివ్య ప్రబంధంలోని 200 పాశురాలను పఠించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్.రమాదేవి పర్యవేక్షించారు. కాగా గురువారం రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
భద్రాచలం, డిసెంబర్ 13 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు బుధవారం అర్చకులు, ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. తొలిరోజు భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రాకార మండపంలో నిత్య కల్యాణమూర్తులు, ఉత్సవమూర్తులకు(స్వర్ణ మూర్తులు) అభిషేకం, తిరుమంజనం జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను అంతరాలయంలోకి తీసుకెళ్లి, నిత్య కల్యాణమూర్తులను మత్స్యావతారంలో అలంకరించారు. మాధ్యాహ్నిక ఆరాధన జరిపారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, వేదఘోషలతో బేడా మండపానికి తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన జరిపించారు. అధ్యయనోత్సవాలను దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి చతుర్వేద పారాయణం, రామాయణ పారాయణం చేసే ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్లకు ఈవో దీక్షావస్ర్తాలు సమర్పించారు. అనంతరం స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో నాళాయిర దివ్య ప్రబంధంలోని 200 పాశురాలను గంటసేపు పఠించారు. ముందుగా ఆళ్వార్కు పరివట్టం కట్టి మెడలో దండవేసి చేతిలో తులసి, చక్కెర ప్రసాదాన్ని ఉంచారు. ఉత్సవమూర్తులు, నిత్య కల్యాణమూర్తులను అంతరాలయంలో ఉంచి మహానైవేద్యం, రాజభోగం సమర్పించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని గోదావరి తీరానికి తీసుకెళ్లి హారతులు సమర్పించారు. తర్వాత మిథిలా స్టేడియంలోని వేదిక వద్దకు కోలాటం, నృత్యాలు, వేదఘోషలతో తోడ్కొని వచ్చారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు మిథిలా స్టేడియానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి తిరువీథి సేవలో విశ్రాంత మండపం వద్ద కాసేపు ఉంచారు. అనంతరం తాతగుడి సెంటర్ వద్దకు తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.