గుండాల/దుమ్ముగూడెం, జూలై 7 : ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి. సహకార సంఘాల్లో రైతులకు సరిపోయేన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని సొసైటీ గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నాలుగైదు రోజులుగా పనిగట్టుకొని వస్తున్నా చివరికి యూరియా దొరకడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండాల, దుమ్ముగూడెం మండల కేంద్రాల్లోని సొసైటీ గోడౌన్ల వద్దకు సోమవారం తెల్లవారుజామునే చేరుకుంటున్న రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. గుండాలలో ఒక్క రైతుకు నాలుగు బస్తాలు ఇస్తామనే నిబంధన పెట్టడంతో రైతులు తమ వరకు వస్తాయో లేదోనని దిగులు చెందుతున్నారు. సోమవారం పలు గ్రామాల నుంచి రైతులు సొసైటీ గోడౌన్ వద్దకు వచ్చినా.. నాలుగు రోజుల నుంచి సీరియల్ ఉన్న రైతులకు మాత్రమే బస్తాలు ఇస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
అంతేకాక రైతుల ఆధార్‌తోపాటు వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా సొసైటీ అధికారులు పరిష్కరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దుమ్ముగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీపురం సొసైటీ గోడౌన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా కొందరికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో.. అందని వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఆధార్ కార్డుకు ఒక్క బస్తా చొప్పున ఇస్తామని సొసైటీ అధికారులు నిబంధనలు విధించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సింత యూరియా ఇచ్చేవారని, పంటల సీజన్ ప్రారంభం కాకముందే ఇన్ని నిబంధనలు పెడితే పూర్తి సీజన్లో పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా కోసం వందలాది మంది రైతులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి సొసైటీ పరిధిలోని రైతులకు సరిపోయేంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
యూరియా కట్టల కోసం నాలుగు రోజుల నుంచి సొసైటీ వద్దకు తిరుగుతున్నా. ముందస్తుగా వేసిన మొక్కజొన్న చేను ఎదుగుదలకు వచ్చింది. పంటకు యూరియా వేయాలంటే దొరకడం లేదు. సొసైటీ అధికారులు ఎప్పుడు మందు కట్టలు ఇస్తారో కూడా చెప్పడం లేదు. సరైన సమయంలో యూరియా వేయకుంటే చేను దెబ్బతింటుంది. అధికారులు స్పందించి మా మండలానికి యూరియా కట్టలు ఎక్కువ పంపించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. -పాయం సారయ్య, రైతు, చీమలగూడెం, గుండాల మండలం