భద్రాచలం, ఏప్రిల్ 21: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి నేతృత్వంలో ఆచార్య, బ్రహ్మ ఋత్వికులు చతుః స్థానార్చాన జరిపారు. సాయంత్రం 6 గంటలకు బేడా మండపంలో బంగారపు ఊయలలో స్వామిని ఉంచి విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యావాహన జరిపి, ఊయలను శేష పాన్పుగా భావించి ఆదిశేషున్ని, అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం ఊయల చుట్టూ చక్ర పొంగలిని బలిహరణంగా సమర్పించారు.