బోనకల్లు, జనవరి 03 : అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు క్రమశిక్షణ, పాఠశాల వాతావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని బోనకల్లు సర్పంచ్ జ్యోతి, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ అన్నారు. శనివారం బోనకల్లు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని చిన్నారులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు కన్నతల్లి తర్వాత అంగన్వాడీ టీచరే తల్లి వంటి వారన్నారు. వారిని ప్రేమగా చూసుకుంటూ ప్రాథమిక విద్యను అందించడంలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని, చిన్నతనం నుంచే బడికి వెళ్లడం అలవాటు చేసుకోవాలనే సదుద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో క్రమశిక్షణ, చక్కటి నడవడిక నేర్పించే విషయంలో అంగన్వాడీ టీచర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.