రఘునాథపాలెం, మార్చి 3: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు విపక్ష పార్టీలు బాసటగా నిలిచాయి. మార్కెట్లో దగాకు గురవుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మిర్చి రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చాయి. సోమవారం విపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నాచౌక్‌లో పెద్దఎత్తున ఆందోళన జరిగింది. అందులో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్ పార్టీల నేతలు పాల్గొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళం విప్పారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటని, ఈ ఏడాది అనుకూల వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయాయని అన్నారు. నిరుడు ఇదే సీజన్లో క్వింటా మిర్చి ధర రూ.23 వేలు ఉంటే ఇప్పుడు కేవలం రూ.12 వేల నుంచి రూ.13 వేల మధ్య మాత్రమే వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటా మిర్చి రూ.25 వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు లింగాల కమల్‌రాజు, సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నాగరాజు, అజ్మీరా వీరూనాయక్, తేజావత్ రామోజీ, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, దొండపాటి రమేశ్, కొండపర్తి గోవిందరావు, అడపా రామకోటయ్య, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, ఆవుల వెంకటేశ్వర్లు, పుచ్చకాయల సుధాకర్, బాగం ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం..
ధరల స్థిరీకరణ కోసం ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చిసాగు చేసిన రైతులు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతమంది రైతులు చనిపోతున్నా మిర్చి ధరలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలి. వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర కల్పించి మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
అనంతరం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ.. వాణిజ్య పంటగా చూస్తున్న మిర్చిని ఆహారపంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాలను నిర్లక్ష్యం చేస్తే మంత్రుల క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నలుగురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే మిర్చి రైతులతో కలిసి మంత్రుల ఇళ్లు, కార్యాలయాలను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.