కారేపల్లి, ఆగస్టు 26 : రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర మంగళవారం కారేపల్లి నుండి ప్రారంభమైంది. కొమురం భీమ్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రకు కారేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, పగడాల నాగేశ్వరావు పుష్పగుచ్చాన్ని అందజేసి సంఘీభావం తెలిపారు. బస్టాండ్ సెంటర్లో గాంధీ విగ్రహానికి జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు పూలమాల వేసి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పిలువబడే మీడియా రంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపు వస్తుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
అనంతరం బస్టాండ్ సెంటర్, సినిమా హాల్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ కార్యాలయాల వరకు పాదయాత్ర కొనసాగింది. సింగరేణి మండల జర్నలిస్టులు పాలిక శ్రీనివాస్, తేల్ల శ్రీనివాసరావు, బోడ అశోక్, దమ్మాలపాటి కృష్ణ, గుడెల్లి శ్రీనివాసరావు, సురేశ్, తోకల సతీశ్, భాగం నాగేశ్వరరావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఇల్లెందు మీడియా ప్రతినిధులు ఈ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వ సాగర్, సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి, సంతోష్ చక్రవర్తి, మధుశ్రీ, మానుకొండ రవికిరణ్, మూర్తి జానీ పాషా పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజేఎఫ్ పాదయాత్ర