ఖమ్మం అర్బన్, మార్చి 4: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 72 కేంద్రాల్లో అధికారులు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నా.. పరీక్ష కేంద్రంలోనికి అనుమతించనున్నారు. అయితే, విద్యార్థులు అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం 17,783 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఈ 72 కేంద్రాల్లోని సమస్యాత్మాక కేంద్రాలను గుర్తించి అక్కడ పటిష్ట ఏర్పాట్లు చేశారు. అయితే, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
వెబ్సైట్లో హాల్‌టికెట్లు..
హాల్‌టికెట్లను పొందేందుకు చిక్కులు లేకుండా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు ఈ ఏడాది కల్పించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై వివరాలు సరిపోతే నేరుగా పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరీక్షలు రాయొచ్చని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఇన్విజిలేటర్లు ఫోన్లు వినియోగించే అవకాశం లేకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. సీఎస్‌లు, డీవోలు పరీక్ష కేంద్రాల్లోని గదులన్నింటినీ నిశితంగా పరిశీలించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
స్కాడ్స్‌తో సమావేశం..
పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐఈవో కార్యాలయంలో డీఐఈవో కే.రవిబాబు.. ఫ్లయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్‌తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఫ్లయింగ్ స్కాడ్స్ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవడంలో స్కాడ్స్దే కీలకపాత్ర అని అన్నారు. తనిఖీలు నిరంతరం జరగాలని ఆదేశించారు.
విద్యార్థులకు సూచనలు..
‘భద్రాద్రి’లో 19,258 మంది
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, మార్చి 4: బుధవారం నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ పరీక్షలను భద్రాద్రి జిల్లాలో 19,258 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకోసం అధికారులు 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. మొదటి సంవత్సర పరీక్షలకు 9,255 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 10,003 మంది హాజరుకానున్నారు. 36 మంది సూపరింటెండెంట్లు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. అలాగే, మూడు సిట్టింగ్ స్కాడ్ బృందాలను, ఐదుగురు కస్టోడియన్ అధికారులను, 550 మంది ఇన్విజిలేటర్లను, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లను నియమించారు. వైద్య సహాయం కోసం 72 మంది ఏఎన్ఎంలను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.