ఖమ్మం ఎడ్యుకేషన్, మే 8: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఈ నెల 10 నుంచి ఆన్లైన్ విధానంలో జరుగనున్నది. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కళాశాలల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఎటువంటి లోటుపాట్లూ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 9,292 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ విభాగంలో 6,192 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పూర్తిగా ఆన్లైన్లో..
ఇంటర్ పూర్తి చేశాక తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షే టీఎస్ ఎంసెట్. ఈ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగానే కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, జేఎన్టీయూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. పూర్తి పారదర్శకంగా పరీక్ష జరిగేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ కేటాయించిన ప్రత్యేక కంప్యూటర్ను టీసీఎస్ ప్రతినిధులు నిశితంగా పరిశీలించిన తర్వాతే వాటిని వినియోగిస్తారు.
8 కేంద్రాలు.. రెండు సెషన్లు..
జిల్లాలో 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున మూడు రోజులపాటు ఇం జినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష జరుగనున్నది. ఆయా కళాశాలల్లోని కంప్యూటర్ల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులను కేటాయించారు. సెషన్-1ను ఉదయం 9గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, సెషన్-2ను మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. సుమారు గంటన్నర ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ అయ్యేందుకు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
కేంద్రాలు ఇవే..
ఖమ్మం నగరంలో బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్, విజయ ఇంజినీరింగ్ కళాశాల, దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సత్తుపల్లిలో సాయిస్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మదర్ థెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్తగూడెంలో అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్స్, పాల్వంచలో అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలల్లో ఐదు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నారు.
అత్యధిక సీసీ కెమెరాలు..
జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలనే ఎంసెట్ ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ఎంపిక చేశారు. ఇప్పటికే చాలా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన అనుభవం ఉన్న కళాశాలలకే అవకాశం ఇచ్చారు. ఆయా కళాశాలల్లో ఉన్న సీసీ కెమెరాలతోపాటు టీసీఎస్ సంస్థ అదనంగా మరిన్ని సీసీ కెమెరాలను అమర్చింది. కేంద్రంలోకి వచ్చే విద్యార్థులు ఏయే పరిసరాల్లో ఉన్నారు? అనే అంశాలను క్షుణ్ణంగా గమనించేలా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష రాసే సమయంలో సైతం విద్యార్థులు ఇతర విద్యార్థుల కంప్యూటర్లు వైపు చూసినా గుర్తించేలా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చారు. వీటన్నింటినీ ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు అన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణను సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షించవచ్చు.