భద్రాచలం, ఆగస్టు 9 : సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందని, గిరిజన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శనివారం భద్రాచలంలోని ఐటీడీఏ గిరిజన భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐటీడీఏ పీవో బి.రాహుల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర, కుమ్రం భీం వంటి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ సంస్కృతిని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా గిరిజనులకు సేవచేసే అవకాశం రావడం సంతోషకరంగా ఉందని జితేశ్ వి పాటిల్ అన్నారు. రైతులు చేపల చెరువులు, పండ్లతోటలు వంటివి సాగుచేసి జీవనోపాధిని మరింత పెంచుకోవాలన్నారు.
తొలుత ఐటీడీఏ పీవో రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌రాజ్ వివిధ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఐటీడీఏ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుని అక్కడ గిరిజన ఆదివాసీ మహనీయుల విగ్రహాలు, అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో కొమ్మునృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోయనృత్యాలు ఆకట్టుకున్నాయి. మళ్లీ ఐటీడీఏకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, పీవో, ఎస్పీలతో కలిసి పరిశీలించారు.
ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలలు నెలకొల్పామని, ప్రతి పాఠశాలలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించామని, ప్రధానంగా గిరిజన బాలికల పాఠశాలలో కాంపౌండ్ వాల్, ఆశ్రమ పాఠశాలల్లో కరెంటు, మంచినీరు, మెనూ ప్రకారం భోజనం ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.
సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు తమ భూములకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నేరుగా అధికారులను సంప్రదించాలని, మధ్యవర్తులను కలవద్దని సూచించారు. అనంతరం గిరిజన మ్యూజియం కాపీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, చర్ల సున్నంగుంపునకు చెందిన ముత్యాలమ్మ జాయింట్ లేయబిలిటీ గ్రూప్ మహిళలు చిరుధాన్యాలతో కొత్తగా తయారుచేసే ఇప్పపువ్వు బర్ఫీ, ఇప్పపువ్వు చాక్లెట్, ఇపపువ్వు లడ్డూలు ఆవిష్కరించారు. మిల్లెట్ బిస్కెట్లు తయారుచేస్తున్న మహిళలను సత్కరించారు. విద్యారంగం, ఆదివాసీ సేవారంగం, క్రీడల విభాగం, అడ్వకేట్, సాంస్కృతిక విభాగాల్లో ప్రావీణం సాధించిన వీసం జ్యోతిర్మయి, మురళి, దివ్య, ఇర్పా జగపతి, చెప్పలే కొమ్మిరెడ్డి, బత్తుల సంజన, తెల్లం శ్రీతేజ, పాయం రవివర్మ, నాగుల శ్రీరాములు, కోండ్రు వీరాస్వామిలకు సన్మానం చేసి మెమోంటోలు అందజేశారు.