ఖమ్మం, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘జగదానందకారకుడు.. జగదభిరాముడు..’ అంటూ భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక భద్రగిరిలో ఆదివారం నేత్రపర్వంగా సాగింది. అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మతల్లి మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. దేవదేవుడి కల్యాణ క్రతువును తిలకించి భక్తజనం పులకించిపోయింది.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు అర్చస్వాములు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, మూలవరులకు అభిషేకం, ధృవమూర్తుల కల్యాణం నిర్వహించారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత కల్యాణమూర్తులకు అలంకరణ చేశారు. మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రత్యేక పల్లకీలో కల్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చి ఆసీనులను చేశారు. అక్కడ కిక్కిరిసిన భక్తజనసందోహం నడుమ శిల్పకళాశోభితమైన మండపంలో జానకిరాముల కల్యాణఘట్టం ఆరంభమైంది.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ గావించి రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్భాలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ నడుముకు అలంకరించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాదప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు.
భక్తరామదాసు చేయించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేదమంత్రోచ్ఛరణలు మార్మోగుతుండగా జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. ఈ జగత్కల్యాణ శుభసన్నివేశాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూస్తుండగా సీతమ్మ తల్లి మెడలో రామయ్య తండ్రి మాంగళ్యధారణ చేశారు.
జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిసిపోయాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య జగదభిరాముడు జానకమ్మను మనువాడారు. రాముడు దోసిట ఉన్న తలంబ్రాలు నీలపురాశులుగా, జానకి దోసిట ఉన్న తలంబ్రాలు మణిమాణిక్యాలుగా సాక్ష్యాత్కరించిన వేళ మిథిలా స్టేడియం భక్తి పారవశ్యంలో ఓలలాడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్ పాల్గొన్నారు.
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాములోరి కల్యాణం జరిపిన మరుసటి రోజు (సోమవారం) శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.