నల్లగొండ ప్రతినిధి, జూన్6(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం గెలుపు కోటాకు దూరంగా నిలిచిపోయారు. దాంతో విజేతను తేల్చేందుకు ఎలిమినేషన్ ప్రక్రియలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం 8గంటలకు మొదలైన కౌంటింగ్‌లో తొలి రోజు సాయంత్రం వరకు కట్టలు కట్టే కార్యక్రమం కొనసాగింది. సాయం త్రం 4గంటల నుంచి మొదలైన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రెండో రోజు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మొత్తం నాలుగు రౌండ్లల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగగా ఒక్కో రౌండ్ కనీసం ఐదారు గంటల సమయం తీసుకుంది. ఇక ఎలిమినేషన్ రౌండ్ సైతం సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి మధ్యాహ్నానికి తుది ఫలితం వెలువడి విజేత తేలనున్నట్లు అంచనా.
మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా నాలుగు రౌండ్లల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం నాలుగు హాల్స్‌లో 96టేబుళ్లపై లెక్కింపు కొనసాగింది. కౌంటింగ్‌లో అందరి దృష్టి ప్రధాన అభ్యర్థులుగా భావించిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కుమార్పైనే ఉంది. తొలి మూడు రౌండ్లలో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం లభించగా చివరి రౌండ్లో రాకేశ్‌రెడ్డి స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించారు. నాలుగు రౌండ్లు ముగిసే సరికి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, అశోక్‌కుమార్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. ఇందులో మొత్తంగా తీన్మార్ మల్లన్న 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను వేరు చేసి చెల్లిన ఓట్లను పరిగణలోకి తీసుకుని గెలుపు కోటాను ఫైనల్ చేశారు.
మొత్తం పోలైన ఓట్లల్లో తొలి ప్రాధాన్యత లెక్కింపు పూర్తయ్యాక పరిశీలిస్తే 25,824ఓట్లు చెల్లనివిగా లెక్క తేలాయి. పట్టభద్రులై ఉండి కూడా నిబంధనల ప్రకారం ఓటు వేయడంలో వీరు విఫలం కావడం గమనార్హం. వీటిని తొలగించిన అనంతరం చెల్లిన ఓట్ల సంఖ్య 3,10,189గా తేలింది. వీటిల్లోంచి 50శాతం ఓట్లు ప్లస్ ఒక్క ఓటును జత చేయగా గెలుపుకోటా 1,55,095 ఓట్లుగా నిర్ధారణ జరిగింది. ఈ ఓట్లను ఏ అభ్యర్థి అయితే సాధిస్తారో వారే విజేత కానున్నారు. ప్రస్తుతం అభ్యర్థుల వారీగా ఓట్లను పరిశీలిస్తే తీన్మార్ మల్లన్న గెలుపు కోటాను చేరుకోవాలంటే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లల్లో 32,282 ఓట్లు సాధించాలి. రాకేశ్‌రెడ్డి విజేతగా నిలవాలంటే 50,853 ఓట్లు ద్వితీయ ప్రాధాన్యతలో పొందాలి. ప్రస్తుతం ఎవరూ కూడా గెలుపు కోటాకు చేరుకోలేకోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి పైకి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఇందులో 10 ఓట్లు మాత్రమే సాధించి చివరలో నిలిచిన యాతాకుల శేఖర్ నుంచి ఎలిమినేషన్ మొదలైంది. శేఖర్‌కు పోలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచివేస్తూ వస్తారు. ఇలా కిందనుంచి పైకి ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను వేస్తూ వస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడ కౌంటింగ్ నిలిపివేస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే చివరి వరకు తీన్మార్ మల్లన్నతోపాటు రాకేశ్‌రెడ్డి పోటీలో నిలువనున్నారు. అప్పటికీ కోటా తేలకపోతే రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా మొదటి అభ్యర్థికి పంచివేస్తూ విజేతను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా ముగిసి విజేత తేలాలంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం తీసుకోవచ్చని అంచనా.
ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గెలుపుపై అటు తీన్మార్ మల్లన్న, ఇటు రాకేశ్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి తనకే ఎక్కువ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పోలవుతాయని భావిస్తున్నారు. అటు స్వతంత్ర అభ్యర్థి అశోక్‌తో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిలకు పోలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లే విజేతను తేల్చడంలో కీలకంగా మారనున్నాయి. వీరికి పోలైన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు ఎటువైపు ఉంటే వారే విజేతగా నిలువనున్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఆర్ఓతోపాటు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఓట్ల లెక్కింపులో తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఫలితాలు ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పలు టేబుళ్లపై ఓట్ల లెక్కింపుతోపాటు మూడో రౌండ్లో తమకు సంబంధం లేకుండానే ఫలితాన్ని ప్రకటించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా కౌంటింగ్ కొనసాగాలే చూడాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్‌లో తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ ఎన్నికల కమిషన్‌తోపాటు అబ్జర్వర్ రాహుల్ బొజ్జకు, రిటర్నింగ్ అధికారి హరిచందనకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి లేఖను అందజేశారు.