కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 17 : తమ సమస్యలపై బాధితులు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సమర్పించిన అర్జీలను స్వీకరించారు. తన పరిధిలోని దరఖాస్తులను పరిశీలించి, మిగిలిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించారు.
అదనపు కలెక్టర్ వార్నింగ్..
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు రావాల్సిన అధికారులు 11 గంటలు దాటినా రాకపోవడంతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సీరియస్ అయ్యారు. ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఆయన అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ ప్రజావాణికి వచ్చే ముందు ఎంత మంది అధికారులు వచ్చారని అడిగారన్నారు. ముందుగా మేము వస్తుంటే.. మీరు ఆలస్యంగా రావడం ఏమిటని అధికారులను అదనపు కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి రావాలని, మొక్కుబడిగా వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.