జూలూరుపాడు/అన్నపురెడ్డిపల్లి/పెనుబల్లి/అశ్వారావుపేట రూరల్, జూలై 13 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం, పాపకొల్లు, పడమటనర్సాపురం, జూలూరుపాడు, గుండెపుడి, మాచినేనిపేటతండా, బేతాళపాడు గ్రామ పంచాయతీల పరిధిలో భారీ వర్షం కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో 79.8 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురవడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం తెరిపివ్వకుండా వర్షం కురవడంతో 24.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టులోకి 4.5 మీటర్ల మేర వరద నీరు చేరింది. అంకమ్మచెరువు, దబ్బతోగు, పాలవాగు, లోతువాగు, కోతులవాగు, బొగందానిగండి, మొద్దులమాడ, బండారుగూడెం గ్రామాల్లోని చిన్నతరహా చెరువుల్లోకి నీరు చేరింది. శనివారం వేకువజాము నుంచి ఏకధాటిగా వర్షం కురవడం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పెనుబల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు జోరువాన కురిసింది. దీంతో మండలవ్యాప్తంగా 32.54 వర్షపాతం నమోదైంది. వీఎం బంజర బస్టాండ్ ప్రాంగణంలో నీరు నిలిచింది. లంకాసాగర్ మధ్యతరహా ప్రాజెక్టులోకి 11.6 శాతం వర్షపు నీరు చేరింది. మండలంలోని రైతులు ఉదయం నుంచే సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.