గిరిజనులకు కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి
పంజాబ్ తరహాలోనే తెలంగాణ ధాన్యాన్ని కొనాలి
రజాకార్ల ఫైల్స్ తెస్తానంటున్న బండి సంజయ్‌కు బుద్ధి చెబుతాం
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్లో పచ్చి అబద్ధాలు చెప్పి తెలంగాణ సమాజాన్ని కించపర్చిన కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడును మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. బిశ్వేశ్వర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలోని నిరుపేదలకు రిజర్వేషన్లు పెంచాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సవరించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని అన్నారు.
ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తీర్మానం సమయంలో శాసనసభ్యుడేనని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు.. ‘తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందా?’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించడం కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న రాష్ట్ర బీజేపీ నేత కిషన్‌రెడ్డి సైతం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో ఎమ్మెల్యేగానే ఉన్నారని గుర్తుచేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం తనకు రాలేదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అత్యున్నత పార్లమెంట్లో తెలంగాణ ప్రజలను అవమాన పర్చిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్‌కు బుద్ధి చెబుతాం..
‘రజాకార్ల ఫైల్స్’ తెస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తగిన బుద్ధి చెబుతామని తాతా మధు, సండ్ర స్పష్టం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాని మోదీతో సహా ఆ పార్టీకి చెందిన నాయకులు ‘కశ్మీర్ ఫైల్స్’ గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ‘రజాకార్ల పైల్స్’ తెస్తామని మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. తెలంగాణ ప్రజలకు కశ్మీర్ ఫైల్స్ అవసరం లేదని, అభివృద్ధి ఫైల్స్, రిజర్వేషన్ల పెంపు ఫైల్స్, అంబేద్కర్ ఫైల్స్ కావాలని డిమాండ్ చేశారు.
పంజాబ్ తరహాలో ధాన్యం కొనాలి..
పంజాబ్ తరహాలోనే తెలంగాణ ధాన్యాన్నీ కొనాలని కేంద్రాన్ని వారు డిమాండ్ చేశారు. ‘ఒకే దేశం – ఒకే సేకరణ’ నినాదం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు శాససనసభ నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం నుంచి సన్మాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 24న సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గ కేంద్రాల్లో, 25న ఖమ్మం, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డీసీసీబీ, వ్యవసాయ మార్కెట్ తదితర అన్ని కమిటీల్లోనూ తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపుతామని వివరించారు. జడ్పీ, డీసీసీబీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య, పగడాల నాగరాజు, నల్లమల వెంకటేశ్వరరావు, కమర్తపు మురళి, తాజుద్దీన్, డోకుపర్తి సుబ్బారావు, గుండ్లపల్లి శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు