కొత్తగూడెం అర్బన్, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మున్సిపాలిటీలు నాటే మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో పట్టణాల పరిధిలోని వివిధ నర్సరీల్లో పెంచిన మొక్కలను నాటేందుకు మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయి పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా రుతుపవనాలు రావడం వల్ల ఈసారి మొక్కలు నాటే ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో జూలై రెండోవారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి సిబ్బంది శ్రీకారం చుట్టారు.
ఒక్కో మున్సిపాలిటీలో రెండు లక్షల మొక్కలు
ఈ ఏడాది నిర్వహించనున్న ‘హరితహారం’లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒక్కో మున్సిపాలిటీలో రెండు లక్షల మొక్కలకు తక్కువకాకుండా నాటాలని జిల్లా ఉన్నతాధికారి ఆదేశించారు. కొత్తగూడెం 2.35 లక్షలు, పాల్వంచ 2.06 లక్షలు, ఇల్లెందు 2 లక్షలు, మణుగూరు 2లక్షల మొక్కలు నాటాలని ఆదేశించగా అందుకు అనుగుణంగా అవసరమైన చోట మొక్కలు నాటుతున్నారు. వైకుంఠధామాలు, స్మృతివనాలు, పార్కులు, బృహత్ పట్టణప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతివనాలు, ఓపెన్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించగా ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టారు.
సొంత నర్సరీల నుంచే మొక్కల పంపిణీ
మున్సిపాలిటీల పరిధిలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న నర్సరీల నుంచే ఈ ఏడాది మొక్కలను పెంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది రూపాయలను వెచ్చించి మొక్కల కొనుగోలు చేసే పరిస్థితిని తప్పించారు. దీంతో ఇప్పుడు ఆ నర్సరీల్లోని మొక్కలు మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా అవసరమైన చోటకు చేర్చి మొక్కలు నాటుతున్నారు. లక్ష మొక్కలను వివిధ ప్రాంతాల్లో, మరో లక్ష మొక్కలను ఇంటికి నాలుగు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో నాటే మొక్కలలో బాదం, మామిడి, సీతాఫలం, జామ, దానిమ్మ ఇతర పండ్ల మొక్కలు ఉండగా, ఇంటికి పంపిణీ చేసే వాటిలో గులాబీ, మందార, మల్లె, నందివర్ధనం, జత్రాస్, నూరువరహాల మొక్కలు, ఇంటికి శోభను చేకూర్చే మొక్కలు ఉన్నాయి.
మొక్కలను రక్షించే బాధ్యత ప్రజలదే…
మానవాళికి ఆక్సిజన్ అందించేందుకు, వాతావరణంలో సమతుల్యత ఉండేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే ప్రక్రియను మొదలుపెట్టింది. అందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టింది. నాటిన మొక్కలు ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు తినకుండా ఉండేందుకు వాటి చుట్టూ అవసరమైన ట్రీ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. మొక్క వంగకుండా నిటారుగా పెరగడానికి కర్రలు సైతం సిబ్బంది కట్టి సంరక్షించే పనిని చేసింది. కానీ మున్సిపాలిటీల్లో కొంతమంది ప్రజలు మొక్కను సంరక్షించేందుకు కట్టిన ట్రీ గార్డులను, కర్రలను దొంగిలిస్తున్నారు. దీనివలన మొక్కను యథావిధిగా పశువులు తినడం వల్ల ప్రయోజనం లేకుండాపోతోంది. ఇటీవల ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. మొక్కలను సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యతను చేపట్టాలి.
మొక్కలను విరివిగా నాటుతున్నాం..
మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించాం. సొంతంగా ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి మొక్కలను తీసుకువచ్చి నిర్దేశించుకున్న స్థలాల్లో నాటుతున్నాం. ప్రతి ఇంటికి నాలుగు మొక్కలను కూడా పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. మొక్కలను కాపాడేందుకు వాచర్లను ఏర్పాటు చేశాం. నాటిన మొక్కలను ప్రతిరోజు వాచర్ పర్యవేక్షిస్తారు.
– జి.రఘు, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం