మామిళ్లగూడెం, జనవరి 11 : పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర చాలా కీలకమని, పలు సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి మన్ననలు పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్స్టేషన్లలోని రిసెప్షన్ సెంటర్లలో పోలీస్ సిబ్బంది పాత్రపై గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా కృషి చేయాలన్నారు. ఎకడ కూడా విమర్శలకు తావు లేకుండా పారదర్శకతను పాటిస్తూ ప్రజల ప్రశంసలు, మెప్పు పొందాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగానే రిసెప్షన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామన్నారు.
వివిధ పనుల కోసం ఠాణాకు వచ్చే సమయంలో స్టేషన్లో ఎస్‌హెచ్‌వో లేకుంటే వచ్చేంత వరకు స్టేషన్ బయట వేచి ఉండకుండా.. ఇబ్బందులు పడకుండా వచ్చిన పని పూర్తయ్యేంత వరకు రిసెప్షన్ సెంటర్లో వేచి ఉండేలా అన్ని వసతులు కల్పించాలన్నారు. రిసెప్షన్ సెంటర్లో సిబ్బంది 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బాధితులు తొలుత ఏ పనిపై స్టేషన్‌కు వచ్చారో ఫిర్యాదును రిజిస్టర్లో నమోదు చేసుకొని, సంబంధిత పోలీస్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అలాగే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు స్థితిగతులను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.