 
                                                            ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 19 : ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ బుధవారం ముగిసింది. టీచర్ల అప్గ్రేడేషన్తోపాటు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందే ప్రక్రియకు తెరపడినట్లయింది. ఉపాధ్యాయుల రెండు రోజుల ఎదురుచూపులకు మంగళవారం అర్ధరాత్రి ముగింపు లభించింది. అనంతరం ఉద్యోగోన్నతుల జాబితాను విద్యాశాఖ వెల్లడించింది. కోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా నిర్వహించడం వల్ల ప్రక్రియలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి మాత్రం పరిసమాప్తమైంది. బుధవారం ఉదయమే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరిపిన ప్రక్రియలో ప్రమోషన్ ద్వారా ఏ ఉపాధ్యాయుడికి ఏ పాఠశాల అలాట్ అయిందో అనే సమాచారం వచ్చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పాఠశాలల సమయానికే అత్యధిక మంది పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు.
జిల్లాలో భాషా పండితులైన తెలుగు, హిందీ టీచర్లతోపాటు పీఈటీలు అప్గ్రేడ్ అయ్యాయి. అలాగే, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారు. ప్రమోషన్ల అధీకృత అధికారి డీఈవో కావడంతో ఉపాధ్యాయులంతా ఆయన నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. వాటిని తీసుకెళ్లి నేరుగా తమకు అలాట్ అయిన పాఠశాలల్లో అందించి సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రమోషన్లకు అర్హులైన ఉపాధ్యాయులు 954 మంది ఉన్నారు. వారిలో బుధవారం సాయంత్రానికి 901 మంది వారికి కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేసినట్లు విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. నూతన పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించారు. రిజిస్టర్లలో సంతకాలు చేసి విధుల్లో నిమగ్నమయ్యారు. కాగా, విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వివరాలను వారి సర్వీస్ రికార్డుల్లో నమోదు చేయనున్నారు. అలాగే, రిపోర్ట్ చేయని వారిలో ఇంకా 53 మంది మిగిలారు. వారిలో విదేశాల్లో ఉన్నవారు, హాస్పిటళ్లలో ఉన్న వారు ఉన్నారు. ఇందులో మరికొందరికి రెండు ప్రమోషన్లు రాగా.. వాటిల్లో వారు ఒక దానిలోనే రిపోర్ట్ చేసి మిగిలిన దానిని వదులుకున్నారు.
గతంలో ఆన్లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. 2024 జూన్ 1 నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తయిన ఉపాధ్యాయులతోపాటు 8 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీకి అర్హులు. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు బదిలీ కోసం తమ దరఖాస్తులను నేరుగా తమ కార్యాలయంలో అందజేయాలని విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ సూచించారు.
 
                            